stock market | లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు…

రెండు రోజుల నష్టాలకు బ్రేక్‌
ఎఫ్‌ఎంసీజీ, రియాల్టీ, పీఎస్యూ బ్యాంక్‌ షేర్ల జోరు..
సెన్సెక్స్‌ 332 పాయింట్లు అప్‌


stock market | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం లాభాల్లో ముగిశాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ సమావేశ నిర్ణయాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించిన వేళ.. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, చమురు ధరలు తగ్గడం దేశీయ మార్కెట్లకు కలిసొచ్చింది. ముఖ్యంగా ఎఫ్‌ఎంసీజీ, రియాల్టీ, పీఎస్యూ బ్యాంకింగ్‌ రంగ షేర్లలో కొనుగోళ్లతో రెండు రోజుల వరుస నష్టాలకు బ్రేక్‌ పడింది.

సెన్సెక్స్‌ ఉదయం 74,249.31 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైంది. రోజంతా పాజిటివ్‌ ట్రెండ్‌లో కదలాడిన సూచీ ఇంట్రాడేలో 74,505.86 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. చివరకు 332.63 పాయింట్లు పెరిగి 74,336.45 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ కూడా లాభాల్లోనే కొనసాగింది. 99 పాయింట్లు ఎగబాకి 23,217.60 వద్ద స్థిరపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.95 వద్ద నమోదైంది.

సెన్సెక్స్‌ 30 షేర్లలో ఐటీసీ, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, ట్రెంట్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, బీఈఎల్‌ షేర్లు లాభాలను నమోదు చేశాయి. మరోవైపు టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎన్‌టీపీసీ, ఎల్‌అండ్‌టీ షేర్లు నష్టాల్లో ముగిశాయి. రంగాల వారీగా చూస్తే ఎఫ్‌ఎంసీజీ, రియాల్టీ, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ షేర్లలో కొనుగోళ్ల ఆసక్తి కనిపించింది. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు.

అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 107.73 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బంగారం ధర ఔన్స్‌కు 4,342.99 డాలర్ల వద్ద కొనసాగుతోంది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయం కోసం మార్కెట్‌ వర్గాలు ఎదురుచూస్తుండగా.. రాబోయే రోజుల్లో గ్లోబల్‌ పరిణామాలు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది.