Stock market | స్టాక్ మార్కెట్ క్రాష్… సెన్సెక్స్ 1,045 పాయింట్లు పతనం…
Stock market | స్టాక్ మార్కెట్ క్రాష్… సెన్సెక్స్ 1,045 పాయింట్లు పతనం…
దేశీయ స్టాక్ మార్కెట్లకు భారీ నష్టం
నిఫ్టీ 371 పాయింట్లు డౌన్
చమురు ధరల సెగ
రూపాయి @ ₹96.78
బంగారం @ $4,123.86
Stock market | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావంతో చమురు ధరలు పెరగడం, విదేశీ నిధుల ఉపసంహరణ, వడ్డీ రేట్ల పెంపు వంటి పరిణామాలు దేశీయ ఈక్విటీ మార్కెట్లను తీవ్రంగా దెబ్బతీశాయి. గురువారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 1,000 పాయింట్లకు పైగా పతనమవగా.. నిఫ్టీ 52 వారాల కనిష్ఠ స్థాయికి చేరింది. దీంతో మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువలో సుమారు రూ.10 లక్షల కోట్ల మేర ఆవిరైంది.
72,668.00 పాయింట్ల వద్ద దాదాపు స్థిరంగా ప్రారంభమైన సెన్సెక్స్.. ఆ వెంటనే నష్టాల్లోకి జారుకుంది. రోజంతా అమ్మకాల ఒత్తిడి కొనసాగడంతో ఇంట్రాడేలో 71,327.75 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది. చివరికి 1,045.46 పాయింట్లు నష్టపోయి 71,593.24 వద్ద ముగిసింది.
నిఫ్టీ కూడా భారీ నష్టాలను చవిచూసింది. సూచీ 371.25 పాయింట్లు కోల్పోయి 22,231.80 వద్ద స్థిరపడింది. ఒక దశలో 52 వారాల కనిష్ఠ స్థాయికి పడిపోయింది.
సెన్సెక్స్ 30లో టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్ మినహా మిగతా కంపెనీల షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఐటీసీ, ఇండిగో, పవర్‌గ్రిడ్, బీఈఎల్, అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ షేర్లలో ప్రధానంగా అమ్మకాలు వెల్లువెత్తాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ఉద్రిక్తతల కారణంగా ముడిచమురు ధరలు పెరగడం మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపింది. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 104.42 డాలర్ల వద్ద కొనసాగింది. అదే సమయంలో విదేశీ పెట్టుబడులు తరలిపోవడం కూడా దేశీయ మార్కెట్లపై ఒత్తిడిని పెంచింది.
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 96.78గా నమోదైంది. అంతర్జాతీయ పరిణామాలతో పాటు వడ్డీ రేట్ల పెంపు ప్రభావం కూడా ఈక్విటీ మార్కెట్లపై కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ఔన్స్ ధర 4,123.86 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
