ఐదు నెలలుగా జీతాల్లేవు.. ఇక సమ్మెబాట!

శ్రీ సత్యసాయి తాగునీటి పథకం కార్మికుల ప్రకటన
రిటైర్డ్ కార్మికులకు గ్రాట్యుటీ చెల్లించాలని డిమాండ్
సమ్మెకు సీఐటీయూ సంపూర్ణ మద్దతు : ఓబులు

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆగస్టు 31 (ఆంధ్రప్రభ): ప్రజల దాహార్తిని తీర్చే తాగునీటి పథకంలో పనిచేస్తున్న కార్మికుల జీవితాల్లో మాత్రం వేతనాల కోసం ఎదురుచూపులే మిగిలాయి. నెలలు గడుస్తున్నా జీతాలు అందకపోవడంతో కుటుంబాలను నెట్టుకొచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న కార్మికులు ఇక పోరుబాట పట్టారు. పెండింగ్‌లో ఉన్న ఐదు నెలల వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని, రిటైర్ అయిన కార్మికులకు రావాల్సిన గ్రాట్యుటీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీ సత్యసాయి తాగునీటి పథకం కార్మికులు ఆగస్టు 31 అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నట్లు ప్రకటించారు.

కార్మికులు చేపట్టనున్న నిరవధిక సమ్మెకు సీఐటీయూ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబులు మాట్లాడుతూ… కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గత ఐదు ఆరు సంవత్సరాలుగా శ్రీ సత్యసాయి తాగునీటి పథకానికి నిధుల విషయంలో అనిశ్చిత పరిస్థితి కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. నిధుల కొరత ప్రభావం నేరుగా కార్మికుల వేతనాలపై పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

వేతనం కోసం ఎన్నిసార్లు సమ్మె చేయాలి?
ప్రతి నెలా వేతనం కోసం కార్మికులు ఆందోళనకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడటం దురదృష్టకరమని ఓబులు అన్నారు. ఐదు నెలలుగా జీతాలు అందకపోవడంతో కార్మిక కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఒక నెల జీతంతోనే కుటుంబ ఖర్చులు, పిల్లల చదువులు, వైద్య అవసరాలు, ఇంటి నిర్వహణ, అప్పుల చెల్లింపులు వంటి అనేక బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుందని, అలాంటిది ఐదు నెలలుగా జీతాలు రాకపోతే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ప్రభుత్వం అర్థం చేసుకోవాలని అన్నారు.

నీరు ఆపని కార్మికులకు జీతాలివ్వరా?
తమకు వేతనాలు అందకపోయినా ప్రజలకు తాగునీటి సరఫరా నిలిచిపోకుండా కార్మికులు విధులు నిర్వహిస్తున్నారని ఓబులు పేర్కొన్నారు. ఎండ, వర్షం, రాత్రింబవళ్లు అనే తేడా లేకుండా పథక నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తున్న కార్మికుల సేవలను ప్రభుత్వం గుర్తించాలని కోరారు. ప్రజలకు నిరంతరంగా తాగునీటిని అందించే కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించలేరా అని ప్రశ్నించారు.

బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి…
శ్రీ సత్యసాయి తాగునీటి పథకానికి రాష్ట్ర బడ్జెట్‌లో ప్రతి సంవత్సరం సరిపడా నిధులు కేటాయించాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. నిధుల కొరత కారణంగా పథకం నిర్వహణకు, కార్మికుల వేతనాలకు ఆటంకం కలగకుండా ప్రభుత్వం శాశ్వత ప్రణాళిక రూపొందించాలని కోరింది. ప్రాజెక్టు నిరంతరాయంగా కొనసాగడంతో పాటు, కార్మికులకు ప్రతి నెలా నిర్ణీత సమయంలో వేతనాలు అందేలా శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.

రిటైర్ అయిన వారికి గ్రాట్యుటీ ఎప్పుడు?
పథకంలో సంవత్సరాల తరబడి సేవలందించి రిటైర్ అయిన కార్మికులకు రావాల్సిన గ్రాట్యుటీని వెంటనే చెల్లించాలని ఓబులు కోరారు. అలాగే ప్రాజెక్టులో పనిచేస్తూ మరణించిన కార్మికుల కుటుంబాలకు రావాల్సిన గ్రాట్యుటీ తదితర బకాయిలను కూడా తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లపాటు ప్రజలకు సేవలందించిన కార్మికులు పదవీ విరమణ అనంతరం కూడా తమ హక్కుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.

కార్మికుల వేతనాలు, ఉద్యోగ భద్రత, గ్రాట్యుటీ తదితర సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. ఆగస్టు 31 అర్ధరాత్రి నుంచి ప్రారంభమయ్యే నిరవధిక సమ్మెతో తాగునీటి పథకం నిర్వహణపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని కోరింది. లేని పక్షంలో కార్మికుల డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు నిరవధిక సమ్మె కొనసాగిస్తామని కార్మిక సంఘాల నాయకులు స్పష్టం చేశారు.