అత్యాధునిక సాంకేతికత ఏర్పాటు.. అనధికారిక దర్శనాలకు కళ్లెం
- లక్షలాది భక్తుల రాకకు విస్తృత ఏర్పాట్లు
- సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యం
- రద్దీ నియంత్రణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం
- 70కి పైగా అనలిటికల్ కెమెరాలతో నిఘా
- ఏఎన్‌పీఆర్, టర్న్‌స్టైల్, యాక్సెస్ కంట్రోల్ గేట్లు
- హోల్డింగ్ ఏరియాలు.. దర్శన సమయాల డిస్‌ప్లే బోర్డులు
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి సిద్ధమవుతోంది. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లను అధికారులు విస్తృతం చేస్తున్నారు. సామాన్య భక్తులకు ప్రథమ ప్రాధాన్యం కల్పించేలా దర్శన క్యూలైన్లు, హోల్డింగ్ ఏరియాలతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా అనధికారిక దర్శనాలను నియంత్రించడం, వాహనాలు, పాస్‌ల ప్రవేశాన్ని క్రమబద్ధీకరించడం, రద్దీని ముందుగానే గుర్తించి నియంత్రించడమే లక్ష్యంగా పలు వ్యవస్థలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
అత్యాధునిక టెక్నాలజీ..
దసరా ఉత్సవాల ఏర్పాట్లలో సాంకేతికతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. గతేడాది వినియోగించిన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, డ్రోన్లు, ఏఎస్పీఆర్, ఫేస్ రికగ్నిషన్ వ్యవస్థలకు ఈసారి మరిన్ని సాంకేతిక పరిజ్ఞానాలను జోడిస్తున్నారు. ఏఎన్‌పీఆర్ బూమ్ బ్యారియర్లు, ఆన్‌లైన్ వీఐపీ, వాహన పాస్‌లతో ప్రవేశాన్ని నియంత్రించనున్నారు. టర్న్‌స్టైల్, యాక్సెస్ కంట్రోల్ గేట్లను ఏర్పాటు చేస్తున్నారు. రద్దీని ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు 70కి పైగా అనలిటికల్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల సంఖ్య పెరుగుతున్న తీరును గుర్తించి ముందస్తు అంచనాతో అవసరమైన చర్యలు చేపట్టేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడనుంది. మూడు హోల్డింగ్ ఏరియాలతో పాటు భక్తులు దర్శనానికి ఎంత సమయం వేచి ఉండాల్సి ఉంటుందో తెలిపే డిస్‌ప్లే బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు.
ఫోన్‌లోనే పార్కింగ్ సమాచారం..
భక్తులకు పార్కింగ్ ప్రదేశాల సమాచారం అందించేందుకు యాప్ ఆధారిత వ్యవస్థను కూడా వినియోగించనున్నారు. పార్కింగ్‌లో ఖాళీ ప్రదేశాల వివరాలను ఫోన్‌లోనే తెలుసుకునే అవకాశం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సాంకేతిక వ్యవస్థలన్నింటినీ సమన్వయం చేస్తూ భక్తుల రాకపోకలను పర్యవేక్షించనున్నారు. ప్రస్తుతం కనకదుర్గనగర్, మహామండపం దిగువ ప్రాంతంలో సాంకేతిక వ్యవస్థలకు సంబంధించిన యంత్రాల ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఉత్సవాలు ప్రారంభానికి మరో మూడు రోజులు మాత్రమే ఉండటంతో అధికారులు త్వరలోనే ఆయా వ్యవస్థల పనితీరును పరిశీలించేందుకు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. రద్దీ పెరిగినా భక్తుల దర్శన ప్రక్రియలో అంతరాయం లేకుండా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేస్తున్నారు.

