- 20ఏళ్ల స్నేహానికి, ఏడు అడుగుల బంధానికి గుడ్ బై
- అధికారికంగా వెల్లడించిన సైనా నెహ్వాల్
న్యూఢిల్లీ : భారత స్టార్ షెట్లర్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ (Saina Nehwal, Parupalli Kashyap) జంట తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. ఈ విషయాన్ని సైనా ఇన్స్టాగ్రామ్ (Instagram) ద్వారా వెల్లడించారు. ఏడేండ్ల వివాహ బంధానికి, 20ఏండ్ల స్నేహానికి ముగింపు పలుకుతున్నట్లు పేర్కొన్నారు. ఎంతో ఆలోచించి, చర్చించిన తర్వాత తామిద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పరస్పర అవగాహన తో సహృద్భావ వాతావరణంలో విడాకులు (divorce) తీసుకుంటున్నామని చెప్పారు.
‘జీవితం కొన్నిసార్లు మనల్ని వేర్వేరు మార్గాల్లోకి తీసుకెళ్తుంది. చాలా ఆలోచన, చర్చల తర్వాత కశ్యప్ పారుపల్లి, నేను విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మేము మా శాంతి, ఎదుగుదల, స్వస్థతను ఎంచుకుంటున్నాం. కశ్యప్‌తో నాకు ఎన్నో తీపిగుర్తులు ఉన్నాయి. ఇకపై మిత్రులుగా ఉంటాం. మా నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తారని, ప్రైవసీని గౌరవిస్తారని ఆశిస్తున్నాం’ అని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.
కాగా, సైనా, కశ్యప్ జంట 2018లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరూ ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ తీసుకున్నారు. అక్కడే వారి స్నేహం ప్రేమగా మారడంతో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. సైనా రెండుసార్లు కామన్వెల్త్ చాంపియన్ (Commonwealth Champion) గా నిలిచారు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలుచుకున్నారు. 2015లో మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్ 1 ర్యాంక్ సాధించారు. దీంతో ఆ ర్యాంక్ సాధించిన తొలి మహిళగా నిలిచారు. సైనా చివరిసారిగా జూన్ 2023లో ప్రొఫెషనల్ సర్క్యూట్లో ఆడారు. ఇక కశ్యప్ 2014లో కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించారు. 2024లో రిటైర్మెంట్ ప్రకటించిన ఆయన కోచింగ్ ప్రారంభించారు.
