స్వర్ణగిరిలో వైభవంగా శ్రీవారి నిత్య కల్యాణం

ఘనంగా తిరువీధి ఉత్సవం, ఊంజల్ సేవ
​తిలకించి తరించిన వేలాదిమంది భక్తులు
​ఆంధ్రప్రభ, ప్రతినిధి, యాదాద్రి : కలియుగ ప్రత్యక్ష దైవం స్వర్ణగిరి వేంకటేశ్వర స్వామి దివ్య క్షేత్రంలో ఆదివారం భక్తిశ్రద్ధల నడుమ ధార్మిక కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వ‌హించారు. ​ఉదయం ప్రాతఃకాలంలో అర్చకులు స్వామివారికి విశేషంగా సుప్రభాత సేవను నిర్వహించారు.

అనంతరం మహాలక్ష్మి అమ్మవారు, ముప్పది మూడు కోట్ల దేవతలు కొలువుదీరిన గోపృష్ట దర్శనాన్ని భక్తులకు కల్పించారు. బంగారు బావి నుంచి సువర్ణ బిందె తీర్థాన్ని వేదమంత్రోచ్ఛారణల నడుమ తీసుకువచ్చి నిత్యారాధన గావించారు. మణిమయ శోభిత స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో స్వామివారిని శోభాయమానంగా అలంకరించి సహస్రనామార్చన నిర్వహించారు. లోక కల్యాణాన్ని ఆకాంక్షిస్తూ అర్చకులు క్షేత్రంలో శ్రీ సుదర్శన నారసింహ హవనాన్ని శాస్త్రోక్తంగా చేశారు.
​అంగరంగ వైభవంగా నిత్య కల్యాణోత్సవం..
పట్టు పీతాంబరాలు, సుగంధ భరిత పుష్పమాలలతో శోభిల్లే వేంకటేశ్వర స్వామికి వైభవోత్సవ మండపంలో వేదమంత్రాలు, మంగళ వాద్యాల మధ్య నిత్య కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించి ఆనందపరవశులయ్యారు. క్షేత్రంలో జరిగిన నిత్యాన్న ప్రసాద వితరణలో సుమారు 5 వేల మందికి పైగా భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
​నయనానందకరంగా తిరువీధి ఉత్సవం..
స్వామివారి తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు. భక్తుల గోవింద నామస్మరణలు, మేళతాళాల నడుమ స్వామివారు మాడవీధులలో శోభాయమానంగా ఊరేగారు. అనంతరం సహస్ర దీప కాంతుల మధ్య ఊయలలో ఆసీనులైన శ్రీవారికి వేదమంత్రోచ్ఛారణలతో కర్పూర మంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుని తరించారు.