నంద్యాల బ్యూరో, జూన్ 3 ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజ్ పూల్ సర్వీస్ చేసేందుకు శాస్త్రవేత్తలు సున్నిపెంటకు చేరుకున్నారు. పూణేకు చెందిన సైంటిస్టులు వీఎన్ కట్టే, అజయ్, డి.సోనావనే, రీచర్స్ అసిస్టెంట్ రాకి లు మంగళవారం నుంచి సర్వే చేస్తున్నారు. సర్వే సందర్భంగా డ్యాం వద్ద కేబుల్ వే మొరాయించడంతో సైంటిస్టులకు ప్లంజ్ పూల్ సర్వేకు కొంత ఆటంకం కలిగింది.
ముందుగా సైంటిస్ట్ ల బృందం జలాశయంలో సర్వే చేపట్టేందుకు బోటును డ్యాం వెనుక నుంచి ముందు భాగానికి కేబుల్ ద్వారా చేర్చారు. ఆ తర్వాత సర్వే కి సంబంధించిన మెటీరియల్ తరలించేందుకు అన్ని సిద్ధం చేసినప్పటికీ కేబుల్ వే లో సాంకేతిక లోపం తలెత్తింది. సిబ్బంది ఇంజనీర్ల బృందం ఆ లోపాన్ని సరిదిద్దే ప్రయత్నంలో ఉన్నారు. సాంకేతిక లోపాన్ని పరిష్కరించే పనులు చేపట్టారు. సాయంకాలం వరకు డ్యాం కింది భాగంలో ఎలాంటి మరమ్మత్తులు చేపట్టాలనే అంశంపై ఇంజనీరింగ్ అధికారులతో చర్చలు జరిపారు.