ఇడుపుకాయితం నుంచి ‘శ్రీలత శ్రీలత’.. తెలంగాణ యాసలో అదిరిపోయే పాట
బొక్కల షోర్వ.. అంబలి సర్వ అంటూ సాగుతున్న లిరిక్స్..
నెట్టింట్లో ఆసక్తికర చర్చ
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: తెలంగాణ నేపథ్యంలో, పూర్తిగా తెలంగాణ యాసలో తెరకెక్కుతున్న ‘ఇడుపుకాయితం’ సినిమా మరోసారి చర్చలోకి వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన ‘శ్రీలత శ్రీలత.. నువ్వు చిన్నబోకే శ్రీలత’ పాట తాజాగా విడుదలై యూట్యూబ్లో ట్రెండ్ అవుతోంది. పాటలోని పదాలు, తెలంగాణ మాండలికం, స్థానిక నుడికారంతో కూడిన లిరిక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ‘బొక్కల షోర్వ.. అంబలి సర్వ’ వంటి తెలంగాణ పదాలు పాటలో వినిపించడంతో నెటిజన్ల దృష్టిని మరింతగా ఆకర్షిస్తున్నాయి.
ఇడుపుకాయితం సినిమా టైటిల్ విషయంలో గతంలో పెద్ద ఎత్తున చర్చ జరిగిన విషయం తెలిసిందే. తెలంగాణ యాస, భాషతో సినిమా రూపొందుతుండటంతో టైటిల్ నుంచి పాటల వరకు ప్రతి అంశంపైనా ఆసక్తి నెలకొంది. తాజాగా విడుదలైన ‘శ్రీలత శ్రీలత’ పాటలోనూ తెలంగాణ భాషకు పెద్దపీట వేయడంతో సోషల్ మీడియాలో దీనిపై చర్చ జరుగుతోంది. ఒకప్పుడు తెలంగాణ యాసను అవమానించినవారే ఇప్పుడు అదే యాస, నుడికారాన్ని అభిమానిస్తున్నారంటూ పలువురు నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటకు వచ్చిన స్పందనతో పాటు, సినిమాలో తెలంగాణ భాష, యాసను ఏ విధంగా చూపించారన్న ఆసక్తి కూడా పెరుగుతోంది.
