నదుల్లో తగ్గుముఖం పట్టిన వరద ఉధృతి

వంశధారలో కొనసాగుతున్న తొలి ప్రమాద హెచ్చరిక

బహుదా, నాగావళిలో భారీగా తగ్గిన ప్రవాహం.. మడ్డువలస ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : జిల్లాను వణికించిన తుఫాను వర్షాలు నిలిచిపోవడంతో ప్రధాన నదుల్లో వరద ఉధృతి క్రమంగా తగ్గుముఖం పట్టింది. శనివారం ఉదయం నాటికి వంశధార, నాగావళి, బహుదా నదుల్లో ప్రవాహం గణనీయంగా తగ్గింది. అయితే వంశధార నదిపై ఉన్న గొట్టా బ్యారేజీ వద్ద మాత్రం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోందని జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు. కుడి, ఎడమ కాలువలను పూర్తిగా మూసివేసి, బ్యారేజీకి వస్తున్న నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

గొట్టా బ్యారేజీ వద్ద శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిగంటకు 48,576 క్యూసెక్కుల వరద ప్రవాహం ఉండగా, శనివారం ఉదయం 6 గంటలకు 42,647 క్యూసెక్కులకు, 7 గంటలకు 40,356 క్యూసెక్కులకు తగ్గింది. బ్యారేజీ పూర్తిస్థాయి నీటిమట్టం 38.10 మీటర్లు కాగా, ప్రస్తుతం 34.87 మీటర్ల వద్ద నీరు ఉంది. మరోవైపు రెండు రోజుల క్రితం ఉధృతంగా ప్రవహించిన బహుదా నది వరద కూడా తగ్గింది. ఇచ్ఛాపురం వద్ద ఉదయం 6 గంటలకు ప్రవాహం 23,048 క్యూసెక్కులకు పడిపోయింది.

నాగావళి నదిలోనూ వరద ఉధృతి గణనీయంగా తగ్గింది. తోటపల్లి, నారాయణపురం ఆనకట్టల వద్ద ఉదయం 7 గంటలకు ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 23,400 క్యూసెక్కులుగా నమోదైంది. శ్రీకాకుళం పాత వంతెన వద్ద ప్రవాహం 24,000 క్యూసెక్కులుగా ఉంది. ఇదిలా ఉండగా గొర్లె శ్రీరాములు నాయుడు మడ్డువలస రిజర్వాయర్‌కు 12,450 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా, స్పిల్‌వే ద్వారా 16,550 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 3.373 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 2.652 టీఎంసీల (78.61 శాతం) నీరు నిల్వ ఉంది. వరద ఉధృతి తగ్గుతుండటంతో తీర ప్రాంత ప్రజలు, జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నారు.