పోలీసు వ్యవస్థలో నిజాయితీ, నిష్పక్షపాత సేవలు ముఖ్యం
ప్రజల హక్కులను గౌరవిస్తూ అంకితభావంతో విధులు నిర్వర్తించాలి: మంత్రి అచ్చెన్నాయుడు
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : నూతనంగా ఎంపికైన పోలీసు కానిస్టేబుళ్లు రాజ్యాంగానికి విధేయులుగా ఉంటూ నిజాయితీ, నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని, ప్రజల హక్కులను గౌరవిస్తూ సమాజానికి అంకితభావంతో సేవలు అందించాలని రాష్ట్ర వ్యవసాయ, మత్స్య, సహకార శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా తండేవలసలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో 142 మంది సివిల్ పోలీసు కానిస్టేబుళ్ల ఆరో బ్యాచ్ ప్రాథమిక శిక్షణ ముగింపు సందర్భంగా మంగళవారం నిర్వహించిన దీక్షాంత్ పరేడ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వందేమాతర గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభమైంది. మంత్రి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డితో కలిసి కవాతును పరిశీలించారు. వైస్ ప్రిన్సిపాల్ భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో నూతన కానిస్టేబుళ్లు చట్టబద్ధంగా విధులు నిర్వర్తిస్తామని ప్రమాణం చేశారు.
పరేడ్ కమాండర్ చింతపల్లి నాగేశ్వరరావు నేతృత్వంలో ఐదు కంటింజెంట్లు నిర్వహించిన మార్చ్‌పాస్ట్ ఆకట్టుకుంది. శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కోల దుర్గారావు, కోట గౌతమ్, జరుగు ఆంజనేయులు, కోల కొత్త ప్రసాద్‌లతో పాటు శిక్షణ సిబ్బందికి మంత్రి ప్రశంసా పత్రాలు, ట్రోఫీలు అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న మహిళా భద్రత, మాదకద్రవ్యాల నియంత్రణ, రహదారి భద్రతలో పోలీసులు క్రియాశీలకంగా పనిచేయాలని సూచించారు. ఇటీవల తుఫాన్ల సమయంలో శ్రీకాకుళం జిల్లాలో మూడు నదుల వరద ముంపు ప్రాంతాల్లో బాధితుల తరలింపు, సహాయక చర్యల్లో పోలీసు శాఖ అందించిన సేవలను అభినందించారు.
శిక్షణ ఇక్కడితో ముగిసిపోదని, మారుతున్న నేరాల తీరుకు అనుగుణంగా నిరంతరం కొత్త విషయాలను నేర్చుకోవాలని మంత్రి సూచించారు. యూనిఫాం గౌరవాన్ని కాపాడుతూ ప్రభుత్వం, దేశ కీర్తిని పెంచేలా పనిచేయాలని ఆకాంక్షించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రజలతో నిరంతరం ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండేది కానిస్టేబుళ్లేనని అన్నారు. మహిళా భద్రత, మాదకద్రవ్యాల నియంత్రణ, రహదారి భద్రతలో వారు కీలక పాత్ర పోషించాలని సూచించారు. జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ తొమ్మిది నెలల కఠిన శిక్షణను 142 మంది క్యాడెట్లు విజయవంతంగా పూర్తి చేయడం అభినందనీయమన్నారు. ఉన్నత విద్యార్హతలు కలిగిన ఈ బ్యాచ్ సభ్యులు సీసీటీఎన్‌ఎస్, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి దర్యాప్తులో రాణించాలని, బాధితుల సమస్యలను ఓపికగా విని న్యాయం చేయాలని సూచించారు. ఐదేళ్ల విరామం తర్వాత నియామకాలు చేపట్టి, వసతుల కల్పనకు నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి ధన్యవాదాలు తెలిపారు.
కాగా, కృష్ణా, రాజమండ్రి జిల్లాలకు చెందిన 142 మంది క్యాడెట్లలో 17 మంది పీజీ, 100 మంది బీటెక్, బీఎస్సీ తదితర ఉన్నత విద్యార్హతలు కలిగిన వారు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గొండు శంకర్, బగ్గు రమణమూర్తి, గౌతు శిరీష, ఎన్. ఈశ్వరరావు, డీపీటీసీ ప్రిన్సిపాల్ పి. శ్రీనివాసరావు, ఇతర పోలీసు అధికారులు, కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
