రెడ్‌క్రాస్ సేవల్లో శ్రీకాకుళం జిల్లా మార్క్
జిల్లాకు గవర్నర్ గోల్డ్‌మెడల్..
అవార్డు అందుకున్న కలెక్టర్
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టిన మానవతా సేవా కార్యక్రమాల్లో శ్రీకాకుళం జిల్లా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి అవార్డును దక్కించుకుంది. 2024–25 సంవత్సరంలో సేవా కార్యక్రమాల్లో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు జిల్లాకు ఈ గౌరవం లభించింది. విజయవాడలో నిర్వహించిన రెడ్‌క్రాస్ రాష్ట్ర శాఖ వార్షిక సాధారణ సమావేశంలో రాష్ట్ర గవర్నర్, ఐఆర్‌సీఎస్ అధ్యక్షుడు అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్, రెడ్‌క్రాస్ జిల్లా అధ్యక్షుడు స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం గవర్నర్ గోల్డ్‌మెడల్ అవార్డును అందుకున్నారు.
సేవా కార్యక్రమాల విస్తరణకు ప్రణాళిక
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రక్తదాన శిబిరాలు, తలసేమియా బాధిత చిన్నారులకు ఉచిత రక్త సరఫరా, విపత్తు నిర్వహణ శిక్షణ, ఆరోగ్య అవగాహన సదస్సులను నిరంతరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో రెడ్‌క్రాస్ సేవలను మారుమూల గ్రామాలకు సైతం విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ పర్యవేక్షణలో యువ రెడ్‌క్రాస్, పర్యావరణ పరిరక్షణ, మహిళలకు నైపుణ్యాభివృద్ధి, ప్రథమ చికిత్స శిక్షణ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. రెడ్‌క్రాస్ ప్రతినిధులు, స్వచ్ఛంద కార్యకర్తలు, రక్తదాతల సమష్టి కృషితోనే ఈ పురస్కారం లభించిందన్నారు.
కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ తరఫున రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ పి.జగన్మోహనరావు అవార్డును స్వీకరించారు. ఐఆర్‌సీఎస్ నిర్వహణ కమిటీ సభ్యులు కనుగుల దుర్గ శ్రీనివాస్, నిక్కు అప్పన్న, బి.చిన్మయిరావు, పి.వైకుంఠరావు, నూక సన్యాసిరావు, ప్రతినిధులు కె.సత్యనారాయణ, జి.రమణ, పి.చైతన్యకుమార్, పి.రాజేష్, ఉమా, మాధవకుమార్, సిబ్బంది, స్వచ్ఛంద కార్యకర్తలు పాల్గొన్నారు.
