శ్రీసిటీ పేలుడు ఘటనపై ఎంపీ గురుమూర్తి దిగ్భ్రాంతి

తిరుపతి, ఆంధ్రప్రభ : శ్రీసిటీ ప్రత్యేక ఆర్థిక మండలిలోని టిల్‌ హెల్త్‌కేర్‌ పరిశ్రమలో శనివారం ఉదయం జరిగిన భారీ పేలుడు ఘటనపై తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందినట్లు వస్తున్న ప్రాథమిక సమాచారం తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. పరిశ్రమలో రాత్రి షిఫ్ట్‌లో విధులు నిర్వహిస్తున్న కార్మికులు ప్రమాద సమయంలో అక్కడే ఉన్నట్లు వస్తున్న సమాచారం ఆందోళన కలిగిస్తోందన్నారు.

ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావడంతో పాటు సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను కోరారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి ఎలాంటి ఆలస్యం లేకుండా మెరుగైన వైద్యం అందించాలని, అవసరమైతే అత్యున్నత వైద్య సదుపాయాలు కల్పించాలని సూచించారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి, పరిశ్రమల్లో కార్మికుల భద్రతా నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే అవసరమైన సహాయం అందించాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు.