అంగరంగ వైభవంగా శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం

  • భక్తులను ఆకట్టుకున్న శ్రీ స్వామివారి తిరువీధి ఉత్సవం

భువనగిరి (రూరల్), ఆంధ్రప్రభ : కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ఆధ్యాత్మిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జ‌రిగాయి.. ఉదయం శుభప్రభాత వేళలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించారు.

అంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారితో పాటు 33 కోట్లదేవతల గోపృష్ఠ దర్శనం భక్తులకు కల్పించారు. ఉదయం 5:45 గంటలకు అర్చక స్వాములు వేదమంత్రోచ్ఛారణల నడుమ సువర్ణ బిందె తీర్థాన్ని బంగారు బావి నుంచి తీసుకువచ్చారు.

6 గంటలకు మేళతాళ మంగళధ్వనుల మధ్య స్వామివారికి తోమాల సేవ నయనానందకరంగా నిర్వహించారు. 7 గంటలకు సుగంధభరిత పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో అలంకరించిన స్వామివారికి సహస్రనామార్చన సేవ ఘనంగా నిర్వహించారు. దివ్యక్షేత్రమైన స్వర్ణగిరిలో భక్తుల లోకక్షేమం కోసం శ్రీ సుదర్శన నరసింహ హవనం ప్రత్యేకంగా నిర్వహించబడింది.

10:30 గంటలకు నిత్య కళ్యాణ మహోత్సవం జరిగింది. అర్చక స్వాములు స్వామివారిని పట్టు పీతాంబరాలతో అలంకరించి, పవిత్ర వేదమంత్రోచ్ఛారణల మధ్య ఈ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు పరవశై ఆనందభరితులయ్యారు.

ప్రతిరోజూ నిర్వహించే నిత్యాన్న ప్రసాద వితరణలో భాగంగా ఈరోజు 3,000 మందికి పైగా భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. సాయంత్రం 6:30 గంటలకు స్వామివారు మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. గోవింద నామస్మరణల మధ్య మేళతాళ, మృదంగ మంగళధ్వనులు మార్మోగాయి.

తిరువీధి ఉత్సవం అనంతరం, స్వామివారు సహస్రదీప కాంతుల మధ్య ఊయలలో ఆసీనై, భక్తులకు దివ్య దర్శనం అందించారు. అర్చక స్వాములు కర్పూర మంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. ఈ ఉత్సవానికి పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు.

Leave a Reply