జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి
సంగారెడ్డి, ఆంధ్రప్రభ: సంగారెడ్డి పట్టణంలోని ఓల్డ్ బస్టాండ్ సమీపంలోని రామ్‌నగర్ రామ్ మందిర్‌లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడాది సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో జగ్గారెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని రామ్ మందిర్ పరిసరాల్లో భక్తిశ్రద్ధలతో భజన కార్యక్రమాలను నిర్వహించారు. జగ్గారెడ్డి స్వయంగా భజనలు చేస్తూ భక్తులతో కలిసి ఊరేగింపులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రామ్ మందిర్ ఆవరణలోని శ్రీకృష్ణుడి ఆలయంలో విగ్రహాన్ని ఊయలలో ఉంచి నిర్వహించిన డోలారోహణం కార్యక్రమంలో జగ్గారెడ్డి పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రామ్ మందిర్ పురవీధుల్లో భజనలు, కోలాటాలతో 12 ఉట్టి కుండలతో ప్రత్యేక ఊరేగింపు నిర్వహించారు. రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు జరిగిన ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని సందడి చేశారు.
భక్తుల సందడి నడుమ సాగిన ఊరేగింపు అనంతరం రామ్ మందిర్ కమాన్ వద్ద సంప్రదాయబద్ధంగా ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. జగ్గారెడ్డి స్వయంగా ఉట్టి కొట్టి భక్తులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి, జగ్గారెడ్డి కుమార్తె జయారెడ్డి, కుమారుడు భరత్ సాయి రెడ్డి పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై శ్రీకృష్ణుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
భక్తి గీతాలు, భజనలు, కోలాటాలు, ఉట్టి కొట్టే కార్యక్రమాలతో రామ్ మందిర్ పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. సంప్రదాయబద్ధంగా నిర్వహించిన శ్రీకృష్ణాష్టమి వేడుకలు భక్తులను ఆకట్టుకున్నాయి.

