రోడ్డు భద్రతపై అవగాహన
శ్రీ జయ ల్యాబ్స్‌లో సీఐ మన్మధ కుమార్ సూచనలు..
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పిలుపు
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మండల పరిధిలోని దండు మల్కాపూర్ వద్ద ఉన్న శ్రీ జయ ల్యాబ్స్ పరిశ్రమలో చౌటుప్పల్ సీఐ జి. మన్మధ కుమార్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశ్రమలోని సిబ్బందికి రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు.
సీఐ మన్మధ కుమార్ మాట్లాడుతూ వాహనదారులు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీటు బెల్ట్ పెట్టుకోవాలని తెలిపారు. భద్రతా నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాల సమయంలో ప్రాణనష్టం తగ్గించవచ్చని పేర్కొన్నారు.
మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగంగా ప్రయాణించడం, వాహనం నడుపుతూ సెల్‌ఫోన్ మాట్లాడటం వంటి నిర్లక్ష్య చర్యలకు దూరంగా ఉండాలని సీఐ హెచ్చరించారు. ఇలాంటి కారణాలతోనే అనేక రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో చౌటుప్పల్ పోలీసు సిబ్బందితో పాటు శ్రీ జయ ల్యాబ్స్ ప్రతినిధులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
