Sricity explosion | పిల్లల చదువుల బాధ్యత శ్రీసిటీదే.. అర్హతను బట్టి ఒకరికి ఉద్యోగం..
Sricity explosion | పిల్లల చదువుల బాధ్యత శ్రీసిటీదే.. అర్హతను బట్టి ఒకరికి ఉద్యోగం
విధుల్లో నిర్లక్ష్యం.. బాయిలర్ ఇన్స్పెక్టర్పై వేటు (సస్పెన్షన్)
ప్రమాద కారణాలపై నాలుగు శాఖలతో సిట్ దర్యాప్తు
సెజ్‌లోని అన్ని పరిశ్రమల్లో థర్డ్ పార్టీ సేఫ్టీ ఆడిట్
వివరాలు వెల్లడించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు
Sricity explosion | సత్యవేడు (శ్రీసిటీ), ఆంధ్రప్రభ : శ్రీసిటీలోని ట్యాబ్లెట్ ఇండియా (టిల్ హెల్త్ కేర్) పరిశ్రమలో జరిగిన ఘోర బాయిలర్ పేలుడు ఘటనలో బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ప్రకటించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బాధితులకు తక్షణ సాయం అందేలా చర్యలు చేపట్టామన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రమాద ఘటనపై తీసుకున్న పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు.
బాధిత కుటుంబాలకు పూర్తి భరోసా…
మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల ఆర్థిక సాయం అందించడంతో పాటు, వారి పిల్లల విద్యా ఖర్చులను పూర్తిగా శ్రీసిటీ యాజమాన్యమే భరిస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఉన్నత విద్య చదివే వారికీ ఈ సాయం అందుతుందన్నారు. కుటుంబంలో అర్హులైన వారిని గుర్తించి శ్రీసిటీ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. పోస్టుమార్టం పూర్తయిన వెంటనే మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించి, శ్రీసిటీ యాజమాన్యం ఖర్చులతోనే దహన సంస్కారాలు జరిగేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
బాయిలర్ ఇన్స్పెక్టర్పై సస్పెన్షన్ వేటు…
ఈ ఘోర ప్రమాదానికి బాధ్యత వహిస్తూ, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన బాయిలర్ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను నిగ్గుతేల్చేందుకు బాయిలర్స్, ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్, పోలీస్ శాఖల అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశామన్నారు. దర్యాప్తులో ఎవరి తప్పు ఉన్నా చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కేసుకు సంబంధించి పాత ఫైళ్లను కూడా పునఃపరిశీలిస్తున్నామన్నారు.
12న్నరేళ్ల వయసున్న బాయిలర్…
సాధారణంగా పరిశ్రమల్లోని బాయిలర్ల జీవితకాలం 20 నుంచి 30 ఏళ్ల వరకు ఉంటుందని, అయితే పేలిపోయిన బాయిలర్‌ను ఏర్పాటు చేసి కేవలం 12న్నర సంవత్సరాలే అవుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించామన్నారు. ఏ సాంకేతిక లోపం వల్ల ఈ ప్రమాదం జరిగిందనేది పూర్తి స్థాయి శాస్త్రీయ పరిశీలన తర్వాతే నిర్ధారణ అవుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
అన్ని పరిశ్రమల్లో భద్రతా తనిఖీలు…
శ్రీసిటీ ఏర్పాటైన 18 ఏళ్ల చరిత్రలో ఇంతటి భారీ ప్రమాదం జరగడం ఇదే తొలిసారని కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. శ్రీసిటీలోని అన్ని పరిశ్రమల్లో తక్షణమే భద్రతా ప్రమాణాలను సమీక్షించి, థర్డ్ పార్టీ సేఫ్టీ ఆడిట్ నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.
