రాయలసీమకు అంతర్జాతీయ విద్యా వరం..

రాయలసీమకు అంతర్జాతీయ విద్యా వరం..

శ్రీసిటీలో రూ.250 కోట్లతో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ

నైపుణ్యాభివృద్ధి, పరిశోధనలు, ఆవిష్కరణలకు కేంద్రంగా రూపుదిద్దుకోనున్న ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ

తిరుపతి (రాయలసీమ బ్యూరో ) ఆంధ్రప్రభ : రాయలసీమ ప్రాంతానికి అంతర్జాతీయ స్థాయి ఉన్నత విద్యా అవకాశాలను అందించే దిశగా కీలక అడుగు పడింది. తిరుపతి జిల్లా సత్యవేడు సమీపంలోని ప్రముఖ పారిశ్రామిక వాడ శ్రీసిటీలో రూ.250 కోట్ల వ్యయంతో ‘శ్రీసిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ’ ఏర్పాటు కానుంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం తాజాగా ఆమోదం తెలిపింది.

గ్రీన్‌ఫీల్డ్ కేటగిరీలో 60 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న ఈ యూనివర్సిటీ కోసం అవసరమైన ఆర్డినెన్స్ జారీకి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నాన్-మెడికల్ కోర్సుల్లో 35 శాతం సీట్లను ప్రభుత్వ కోటా కింద కేటాయించేందుకు కూడా అంగీకారం కుదిరింది.

తిరుపతి జిల్లాలోని శ్రీసిటీ ఇప్పటికే దేశ, విదేశాలకు చెందిన 200కు పైగా పరిశ్రమలకు నిలయంగా గుర్తింపు పొందింది. వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఈ పారిశ్రామిక వాడ, దేశంలోనే అత్యుత్తమ ఇండస్ట్రియల్ జోన్‌లలో ఒకటిగా పేరుగాంచింది. ఇదే ప్రాంతంలో ఇప్పటికే ఐఐఐటీ, Krea University, IFMR Graduate School of Business వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో శ్రీసిటీ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో కొత్త ప్రైవేట్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమైంది. ముఖ్యంగా స్టార్టప్‌లు, ఇంక్యూబేటర్లు, యాక్సిలరేటర్లు, పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణలకు అవసరమైన నైపుణ్యాలను అందించే అత్యాధునిక విద్యను అందించడమే లక్ష్యంగా ఈ యూనివర్సిటీ రూపుదిద్దుకోనుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనివర్సిటీల చట్టం–2016 షెడ్యూల్‌లో సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. పరిశోధనలకు, విజ్ఞానాభివృద్ధికి, పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన మానవ వనరుల తయారీలో ఈ యూనివర్సిటీ కీలక పాత్ర పోషించనుందని అధికారులు భావిస్తున్నారు.

అన్నింటికంటే ముఖ్యంగా ఈ యూనివర్సిటీ అందించే నాన్-మెడికల్ కోర్సుల్లో 35 శాతం సీట్లను ప్రభుత్వ కోటా కింద కేటాయించడం ద్వారా రాష్ట్ర విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ అంశంపై శ్రీసిటీ ఎడ్యుకేషన్ ఫౌండేషన్, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మధ్య అవగాహన కుదిరింది.

రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం నేపథ్యంలో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, రియల్‌టైమ్ గవర్నెన్స్, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి Nara Lokesh త్వరలో శ్రీసిటీ ఆవరణలో యూనివర్సిటీ తాత్కాలిక క్యాంపస్‌ను లాంఛనంగా ప్రారంభించే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి.

Leave a Reply