డ్రోన్‌తో మందుల పిచికారీ.. సమయం, శ్రమ ఆదా

హసన్‌పర్తి, ఆంధ్రప్రభ: డ్రోన్‌ ద్వారా మందులు పిచికారీ చేయడం వల్ల తక్కువ సమయంలో పంటకు సమానంగా మందులు అందడంతోపాటు రైతులకు సమయం, శ్రమ ఆదా అవుతుందని మండల వ్యవసాయ అధికారి అడ్లూరి అనురాధ తెలిపారు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం నాగారం గ్రామానికి చెందిన రైతు నేతాని ఉమారెడ్డి కంది చేనులో నిర్వహించిన ఫామ్‌ స్కూల్‌లో భాగంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో డ్రోన్‌ ద్వారా వేపనూనె, క్లోరిపైరిఫాస్‌ మందులను పిచికారీ చేశారు. కంది పంటలో ఆకు ముడత, ఆకు జాలీ పురుగుల నివారణకు చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా పంటను క్షేత్రస్థాయిలో పరిశీలించి పురుగు ఉధృతిని గుర్తించారు. రైతులకు సమగ్ర సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పించి, అనంతరం ఫామ్‌ స్కూల్‌ చేనులోనే డ్రోన్‌ సాంకేతికతతో మందుల పిచికారీ చేపట్టారు.

రైతులు కంది పంటను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ పురుగు ఉధృతిని బట్టి సస్యరక్షణ చర్యలు చేపట్టాలని అనురాధ సూచించారు. డ్రోన్‌ సాంకేతికతను వినియోగించడం వల్ల మందుల పిచికారీ వేగంగా, సమర్థంగా పూర్తవుతుందని తెలిపారు. కార్యక్రమంలో కమలాపూర్‌ వ్యవసాయ శాఖ అధికారి వేణు, నాగారం ఏఈఓ శైలజ, నాగారం గ్రామ రైతులు పాల్గొన్నారు.