మహిళల అండర్-19 ఆసియాకప్ టోర్నీలో భారత మహిళల జట్టు అదరగొడుతొంది. వరుస విజయాలతో ఫైనల్స్‌కు చేరుకుంది. శుక్రవారం శ్రీలంకతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో తొలుగ బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 9 వికెట్ల నష్టానికి 98 పరుగులే నమోదు చేసింది. శ్రీలంక బ్యాటర్లలో మనుడి నానయక్కర (33; 30 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు), సుముడు నిసంసాల (21) మాత్రమే రెండు అంకెల స్కోరు చేశారు. భారత బౌలర్లలో ఆయుషి శుక్లా నాలుగు వికెట్లతో రాణించింది. ఇక పరుణికా సిసోడియా రెండు వికెట్లు తీయగా, షబ్నమ్ షకీల్, దృతి కేసరి ఒక్కో వికెట్ తీశారు.
అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన యువ భారత్ 14.5 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. తెలుగు అమ్మాయి గొంగిడి త్రిష (32), కమలిని (28) రాణించారు. శ్రీలంక బౌలర్లలో చమోడి ప్రభోద మూడు వికెట్లు, శశిని గిమ్హాని రెండు వికెట్లు తీశారు.