ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ తుది సమరానికి భారత్, న్యూజిలాండ్ సన్నద్ధమయ్యాయి. శుక్రవారం నుంచి జరిగే ఈ ఫైనల్లో గెలిచిన జట్టు తొలి డబ్ల్యూటీసీ చాంపియన్‌గా నిలుస్తుంది. 2019–21 మధ్య కాలంలో జరిగిన టెస్టు సిరీస్‌లలో సాధించిన పాయింట్లను బట్టి భారత్, కివీస్ ఫైనల్ చేరాయి. ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లు… మ్యాచ్‌కు ఒక రోజు ముందే టీమిండియా తమ తుది జట్టును ప్రకటించింది. ఐదుగురు రెగ్యులర్ బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్‌తో పాటు ముగ్గురు పేస్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లకు చోటు కల్పించింది. ఇంగ్లండ్ గడ్డపై తొలిసారి ఓపెనింగ్ చేయనున్న రోహిత్ అక్కడి పరిస్థితుల్లో ఎలా ఆడతాడన్నది ఆసక్తికరం. మరో ఓపెనర్ గిల్ కూడా తొలిసారి ఇంగ్లండ్‌లో బరిలోకి దిగుతున్నాడు.
వీరిద్దరు శుభారంభం అందిస్తే ఆ పునాదిపై జట్టు భారీ స్కోరు చేసేందుకు అవకాశం ఉంది. తర్వాతి మూడు స్థానాల్లో సీనియర్లు పుజారా, కోహ్లి, రహానే బ్యాటింగ్ భారం మోస్తారు. టెస్టు క్రికెట్ వీరికి ఉన్న అనుభవం, అన్ని పరిస్థితుల్లోనూ ఆడగల నైపుణ్యం జట్టుకు కీలకం కానుంది. వికెట్ కీపర్ పంత్ కూడా తనదైన శైలిలో దూకుడును ప్రదర్శిస్తే భారత్‌కు తిరుగుండదు. బౌలింగ్‌లో తమ అత్యుత్తమ బలగాన్ని భారత్ బరిలోకి దించుతోంది. బుమ్రా, షమీల జోడి ప్రత్యర్థిని దెబ్బ కొట్టేందుకు మరోసారి జత కట్టింది. మూడో పేసర్‌గా సిరాజ్ పేరు ముందుకు వచ్చినా… 101 టెస్టుల ఇషాంత్ అనుభవాన్నే జట్టు నమ్ముకుంది. ఇక స్పిన్ ప్రభావం ఉండవచ్చని భావిస్తున్న నేపథ్యంలో అశ్విన్, జడేజాలిద్దరికీ టీమ్‌లో చోటు లభించింది. పైగా వీరిద్దర బ్యాటింగ్ జట్టుకు అదనపు బలం. ముఖ్యంగా గత కొంత కాలంగా జడేజా అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఐదుగురు బౌలర్ల వ్యూహం కారణంగా ఆంధ్ర ఆటగాడు విహారిని కూడా పక్కన పెట్టాల్సి వచ్చింది.