Saturday, November 23, 2024

Wriddhiman Saha | అంతర్జాతీయ క్రికెట్‌కు సాహా గుడ్‌బై!

టీమ్‌ఇండియా సీనియర్‌ ప్లేయర్‌ వృద్ధిమాన్‌ సాహా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు ఆదివారం రాత్రి సోషల్‌ మీడియాలో వెల్లడించాడు. ప్రస్తుతం ఆడుతున్న రంజీనే తన కెరీర్లో ఆఖరిదని, ఇకపై ఐపీఎల్‌ బరిలోనూ దిగనని వెల్లడించాడు.

ప్రతిష్ఠాత్మకమైన క్రికెట్‌ జర్నీలో ఇదే నా చివరి రంజీ ట్రోఫీ. బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నా. రిటైర్‌ అయ్యే ముందు కేవలం రంజీలోనే ఆడుతాను. ఈ సీజన్‌ గుర్తుండిపోయేలా చేసుకుంటా అని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ధోనీ రిటైర్మెంట్‌ తర్వాత టెస్టుల్లో సాహానే వికెట్‌ కీపింగ్‌కు బెస్ట్‌ చాయిస్‌గా ఉన్నాడు.

కానీ ఆ తర్వాత ఫామ్‌ కోల్పోయి జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో యువ ఆటగాళ్లు రిషభ్ పంత్‌, కేఎస్‌ భరత్‌, ధ్రువ్‌ జురెల్‌ జట్టులోకి రావడంతో సాహాకు టీమ్‌ఇండియాలో తలుపులు మూసినట్లయింది. 2021లో సాహా న్యూజిలాండ్‌పై తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడాడు.

2010లో అంతర్జాతీయ కెరీర్‌ ప్రారంభించాడు. 40 టెస్టుల్లో టీమ్‌ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు. 29 సగటుతో 1353 పరుగులు చేశాడు. అందులో 3 సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్‌లో 170 మ్యాచ్‌లు ఆడాడు. 127.57 స్ట్రయిక్‌ రేటుతో 2934 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 13 హాఫ్‌ సెంచరీలున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement