డబ్ల్యూపీఎల్ టోర్నీకి సమయం ఆసన్నమైంది. ఈ మహిళల టీ20 టోర్నీ 23 నుంచి ప్రారంభం కానుంది. కాగా, డబ్ల్యూపీఎల్ సెకంగ్ ఎడిషన్ ప్రారంభోత్సవంలో బాలీవుడ్ సెలబ్రిటీ కార్తీక్ ఆర్యన్ ప్రదర్శన ఇవ్వబోతున్నారు. ఈ ఈవెంట్ 23న సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభం కానుండగా.. ఈ కార్యక్రమం తరువాత డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్, గతేడాది రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య తొలి మ్యాచ్ రాత్రి 7:30కు జరగనుంది. ఈ మ్యాచ్‌ల లైవ్ స్ట్రీమ్ ప్రముఖ టీవీ ఛానెల్ స్పోర్ట్స్ 18, OTT ప్లాట్‌ఫారమ్ Jio సినిమాలో అందుబాటులో ఉంది. ఇక ఈ మ్యాచ్‌లు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం, ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియాల్లో జరగనుండగా.. మార్చి 17వ తేదీన ఫైనల్ జరగనుంది.
5 జట్లు.. 22 మ్యాచ్‌లు
డబ్ల్యూపీఎల్ 2024 టోర్నీలో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్ జట్లు తలపడనున్నాయి. ఈ ఏడాది టోర్నీలో మొత్తంగా 22 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో 20 లీగ్ మ్యాచ్‌లు, ఓ ఎలిమినేటర్, ఫైనల్ ఉంటాయి. పాయింట్ల పట్టికలో ఫస్ట్ ఉండే జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. రెండు, మూడు స్థానాల్లో ఉండే జట్లు ఎలిమినేటర్ ఆడతాయి. ఎలిమినేటర్ గెలిచే జట్టు ఫైనల్ చేరుతుంది.
డబ్ల్యూపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ జట్టుకు భారత సారథి హర్మన్ ప్రీత్ కౌర్, ఢిల్లీకి ఆస్ట్రేలియా ప్లేయర్ మెగ్ లానింగ్, గుజరాత్ జెయింట్స్ జట్టుకు ఆసీస్ స్టార్ బెత్ మూనీ, రాయల్ చాలెంజర్స్ జట్టుకు టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన, యూపీ వారియర్స్ టీమ్‌కు ఆస్ట్రేలియా క్రికెటర్ అలీసా హేలీ కెప్టెన్సీ చేయనున్నారు.