మళ్లీ ఆ ఇద్దరి మధ్యే ఫైనల్‌కు వింబుల్డన్ సెంటర్ కోర్టు సిద్ధమైంది. ఏడుసార్లు విజేత నొవాక్ జొకోవిచ్, డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కారజ్ వరుసగా రెండో ఏడాది తుదిపోరులో అమీతుమీ తేల్చుకోనున్నారు. గత రాత్రి జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో రష్యన్ స్టార్ డానిల్ మెద్వెదెవ్‌ను మూడోసీడ్ అల్కారజ్ 6-7(1-7), 6-3, 6-4, 6-4తో చిత్తుచేయగా.. ఇటలీకి చెందిన 22 ఏళ్ల కుర్రాడు లోరెంజో ముసేటి జోరుకు చెక్ పెడుతూ రెండోసీడ్ జొకోవిచ్ 6-4, 7-6(7-2), 6-4తో గెలుపొందాడు.
నిరుడు ఇదే వేదికపై హోరాహోరీగా జరిగిన ఫైనల్లో 24 గ్రాండ్‌స్లామ్‌ల వీరుడు జొకోవిచ్ ఆధిపత్యానికి గండికొడుతూ 21 ఏళ్ల అల్కారజ్ తొలిసారి ఆల్ ఇంగ్లండ్ క్లబ్‌లో విజేతగా నిలిచాడు. మరి.. ఈసారీ అదే ఫలితాన్ని పునరావృతం చేసి స్పెయిన్ కుర్రాడు అల్కారజ్ అద్భుతం చేస్తాడా…. లేదంటే 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో సెర్బియా యోధుడు నొవాక్ చరిత్ర సృష్టిస్తాడా అన్నది ఆదివారం తేలనుంది.
నేటి మ్యాచ్‌లు…
నేడు జరిగే మహిళల సింగిల్స్ ఫైనల్లో క్రెజ్‌సికోవాతో పౌలినీ తలపడనుంది. మహిళల డబుల్స్ ఫైనల్లో కాటేరినా సినియాకోవా-టేలర్ టౌన్సెండ్ జోడీ ఎరిన్ రౌట్‌లిఫ్- గాబ్రియేలా డబ్రోవ్స్‌కీ జొడీ ఢీ కొట్టనుంది. మరోవైపు పురుషుల డబుల్స్ ఫైనల్‌లో మ్యాక్స్‌పర్సెల్-జోర్డాన్ థాంప్సన్, హరిహెలియోవరా-హెన్రీపాటెన్ జోడీ పోటీపడనుంది.
ఇప్పటికే జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ సెమీఫైనల్స్‌లో మైఖేల్ వీనస్-ఎరిన్ రౌట్‌లిఫ్‌పై… జాంజిలిన్‌స్కీ-హసీహ్‌సువీ జోడీ 7-6, 6-3తో గెలిచి ఫైనల్స్‌కు చేరుకుంది. ఇక ఆదివారం జరిగే మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్‌లో జాంజిలిన్స్‌కీ-హసీహ్‌సువీ జోడీ శాంటియాగో గొంజాలెజ్-గిలియానా ఒల్మోస్ జోడీతో తలపడనుంది.