Tuesday, November 26, 2024

Paris Olympics | రెండు వంద‌ల శాతం శ్ర‌మిస్తా… ప‌త‌కం తెస్తా : పీవీ సింధూ

పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నానని, కచ్చితంగా సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పేర్కొంది. హ్యాట్రిక్ మెడల్స్ సాధించడం అంత తేలికైన విషయం కాదని, కానీ 200 శాతం శ్రమించి సత్తాచాటుతానని తెలిపింది. మరో ఎనిమిది రోజుల్లో విశ్వక్రీడలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. జులై 26 నుంచి మొదలయ్యే ఈ మహా సమరం ఆగస్టు 11 వరకు కొనసాగనుంది.

టోక్యో ఒలింపిక్స్‌లో సాధించిన ఏడు పతకాల కంటే మించి మెడల్స్ సాధించాలనే పట్టుదలతో భారత క్రీడాకారులు పారిస్‌కు సిద్ధమయ్యారు. పతకాల వేట కోసం భారత్ నుంచి 117 మంది బరిలోకి దిగుతున్నారు. గత రెండు ఒలింపిక్స్‌ పతక విజేత పీవీ సింధు మరోసారి భారత్‌కు పతకాన్ని తెస్తుందని దేశమంతా ఆమెపై ఆశతో ఉంది.

2016 రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన సింధు, గత టోక్యో విశ్వక్రీడల్లో కాంస్యం నెగ్గింది. అయితే కామెన్వెల్త్ క్రీడల అనంతరం సింధు ఫామ్ కోల్పోయింది. గాయం నుంచి కోలుకుని పునరాగమనం తర్వాత తనపై ఉన్న అంచనాలకు తగ్గట్లుగా సత్తాచాలేకపోతుంది. అప్పటి నుంచి ఒక్క టైటిల్‌ కూడా గెలవలేదు. కానీ విశ్వక్రీడల వేదిక అంటే తాను 200 శాతంతో సత్తాచాటుతానని, స్వర్ణం సాధిస్తానని పీవీ సింధు పేర్కొంది.

”మూడో పతకం తప్పక నాకు ప్రేరణనిస్తోంది. గోల్డ్ మెడల్ లక్ష్యంగా పోరాడతా. ఒలింపిక్స్‌లో బరిలోకి దిగితే 200 శాతం ప్రదర్శన చేస్తా. హ్యాట్రిక్ పతకాలు సాధించడం అంత సులువైన విషయం కాదు. కానీ దేశం ఆశలను నెరవేరుస్తా. మూడో పతకం సాధిస్తా. నా మనసంతా స్వర్ణం గెలవడంపైనే ఉంది. ఇదే నాకు ప్రేరణ, విశ్వాసాన్ని అందిస్తుంది”

”విశ్వక్రీడలు అంటే విపరీతమైన పోటీ ఉంటుంది. టాప్ 10-15 మంది ప్లేయర్లు ఒకే ప్రమాణాలతో ఆడతారు. ఒలింపిక్స్‌లో పాయింట్లు సాధించడం అంత తేలిక కాదు. ప్రతి పాయింట్ కోసం తీవ్రంగా శ్రమించాలి. చిన్న పొరపాటు అన్నింటిని మార్చేస్తుంది” అని పీవీ సింధు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement