Friday, November 22, 2024

WI vs NZ | సూప‌ర్ 8లోకి విండీస్.. ఇంటికి కివీస్

ప్రతీ ప్రపంచకప్ లో చివరి వరకు పోరాడి, సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్ ల్లో ఓటమి పాలై, తిరిగి వెళ్లే న్యూజిలాండ్ ఈసారి సంప్రదాయానికి విరుద్ధంగా ఆడింది. గ్రూప్ దశలోనే రెండు మ్యాచ్ ల్లో ఓటమిపాలై అట్టడుగు స్థానంలో పడి ఇంటి దారి పట్టనుంది. నేడు వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో చివరి వరకు పోరాడిన న్యూజిలాండ్ ఓటమిపాలైంది. గ్రూప్ ఏ లో పాకిస్తాన్ పరిస్థితి ఇంచుమించు అలాగే ఉంది.

టాస్ గెలిచిన న్యూజిలాండ్ మొదట బౌలింగు తీసుకుంది. దీంతో బ్యాటింగ్ కి వచ్చిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో కివీస్ 20 ఓవర్లలో 136 పరుగులకి ఆలౌట్ అయింది. 13 రన్స్ తేడాతో ఓటమిపాలైంది.

150 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ కి శుభారంభం దక్కలేదు. ఓపెనర్ డేవిన్ కాన్వే (5) వెంటనే అయిపోయాడు. మరో ఓపెనర్ ఫిన్ అలెన్ (26) కొంచెం ఫర్వాలేదనిపించాడు. తర్వాత వచ్చిన రచిన్ రవీంద్ర (10), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (1) , డేరియల్ మిచెల్ (12) ముగ్గురూ నిరాశపరిచారు.

గ్లెన్ పిలిప్స్ ఒక్కడూ ఒంటరిపోరాటం చేశాడు. 2 సిక్స్ లు, 3 ఫోర్ల సాయంతో 40 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు. దాంతో కివీస్ కి విజయపు ద్వారాలు దాదాపు మూసుకుపోయాయి. ఈ పరిస్థితుల్లో జేమ్స్ నిషామ్ (10) తో కలిసి మిచెల్ సాంట్నర్ (21 నాటౌట్) ప్రయత్నించాడు కానీ ఫలితం రాలేదు. ఓవర్లు అయిపోవడంతో 136 పరుగుల వద్ద న్యూజిలాండ్ ఆగిపోయింది. సూపర్ 8 కి వెళ్లకుండానే కివీస్ తిరుగుముఖం పట్టనుంది.

ఎందుకంటే గ్రూప్ సి లో 6 పాయింట్లతో వెస్టిండీస్ ఉంది. దాని వెనుక 5 పాయింట్లతో స్కాట్లాండ్ ఉంది. కివీస్ ఇంకా రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. అవి రెండూ గెలిచినా 4 పాయింట్లే వస్తాయి. వెళితే వెస్టిండీస్, స్కాట్లాండ్ సూపర్ 8 కి చేరతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement