రాజస్థాన్ రాయల్స్ వెటరన్ పేసర్ సందీప్ శర్మ దుమ్మురేపుతున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో నిప్పులు చెలరేగుతున్నాడు. తన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నాడు. ముంబై ఇండియన్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో సందీప్ శర్మ(5/18) ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు.
4 ఓవర్లు బౌలింగ్ చేసి 4.50 ఎనానమీతో 5 వికెట్లు పడగొట్టాడు. పవర్ ప్లేలో ఇషాన్ కిషన్(0), సూర్యకుమార్ యాదవ్(10)లను ఔట్ చేసిన సందీప్ శర్మ డెత్ ఓవర్లలో తిలక్ వర్మ(65), టీమ్ డేవిడ్(3), గెరాల్డ్ కోయిట్జీ(0)లను ఔట్ చేసి ముంబై ఇండియన్స్ పతనాన్ని శాసించాడు. ఈ సీజన్‌లో మూడు మ్యాచ్‌లే ఆడిన సందీప్ శర్మ 6 వికెట్లతో సత్తా చాటాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో కట్టడిగా బౌలింగ్ చేస్తూ రాజస్థాన్ రాయల్స్‌కు ఛాంపియన్‌గా బౌలర్‌గా మారాడు. బ్యాటర్ల హవా సాగుతున్న ఈ సీజన్‌లో సందీప్ శర్మ బంతితో అదరగొడుతున్నాడు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఐపీఎల్ 2023 సీజన్ కోసం నిర్వహించిన వేలంలో సందీప్ శర్మను ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు.
రూ. 50 లక్షల కనీస ధరకు కూడా అతన్ని తీసుకునేందుకు 10 ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. దాంతో అతను అమ్ముడుపోని ఆటగాడిగా నిలిచిపోయాడు. చివరకు సీజన్ ప్రారంభానికి ముందు రాజస్థాన్ రాయల్స్‌లో ఓ ఆటగాడు గాయపడటంతో ఆ జట్టు సందీప్ శర్మతో రిప్లేస్ చేసుకుంది. ఆ సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన సందీప్ శర్మ డెత్ ఓవర్ స్పెషలిస్ట్‌గా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. దాంతో రాజస్థాన్ రాయల్స్ అతన్ని జట్టులోనే ఉంచుకుంది. ఈ సీజన్ ఆరంభంలో అతను గాయపడ్డాడు. పూర్తిగా కోలుకొని సంచలన ప్రదర్శనతో రాజస్థాన్ రాయల్స్‌కు అద్భుత విజయాలు అందిస్తున్నాడు. సందీప్ శర్మపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. రూ. 24.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన మిచెల్ స్టార్క్ కంటే సందీప్ శర్మ ఎంతో నయమని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.