Wednesday, November 20, 2024

Sunrisers : వెల్ డ‌న్ గ‌య్స్.. త‌ల ఎత్తుకునేలా చేశారు…కావ్య‌మార‌న్

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లపై ఆ జట్టు ఓనర్ కావ్యా మారన్ ప్రశంసల జల్లు కురిపించింది. దురదృష్టవశాత్తు తృటిలో టైటిల్ చేజారినా.. తాము తల ఎత్తుకునేలా ఆడారని కొనియాడింది. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం జరిగిన ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ పరాజయంతో టైటిల్ గెలిచే సువర్ణవకాశాన్ని చేజార్చుకుంది. ఈ పరాజయం అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లిన కావ్యా మారన్.. ఆటగాళ్లందరికి ధన్యవాదాలు తెలియజేసింది.

- Advertisement -

టైటిల్ గెలవలేదని బాధపడాల్సిన అవసరం లేదని, దూకుడైన ఆటతో టీ20 క్రికెట్‌కే కొత్త నిర్వచనం చెప్పారని ప్రశంసించింది. ఆరెంజ్ ఆర్మీ అభిమానులంతా కాలర్ ఎగిరేసేలా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారని పేర్కొంది.

‘గాయ్స్ మీరంతా మేం తల ఎత్తుకునే ప్రదర్శన చేశారు. ఈ విషయం చెప్పేందుకే నేను ఇక్కడికి వచ్చాను. నిజంగా మీరు టీ20 క్రికెట్‌ ఎలా ఆడాలి అనేదానికి కొత్త నిర్వచనం చెప్పారు. ప్రతీ ఒక్కరు మన గురించి మాట్లాడుకునేలా చేశారు. దురదృష్టవశాత్తు ఈ రోజు మనకు కలిసి రాలేదు. కానీ మీరు మాత్రం అసాధారణ ప్రదర్శన కనబర్చారు.

జట్టులోని ప్రతీ ఒక్కరు బ్యాట్, బంతితో సత్తా చాటారు. అందరీకి నా ధన్యవాదాలు. గతేడాది చివరి స్థానంలో నిలిచాం. అయినా అభిమానులంతా భారీ సంఖ్యలో మన మ్యాచ్‌లకు హాజరయ్యారంటే మీ అసాధారణ ప్రదర్శనే కారణం. ప్రతీ ఒక్కరు మన అద్భుత ప్రదర్శన గురించి మాట్లాడుకుంటున్నారు. కేకేఆర్ టైటిల్ గెలిచినా.. ఇప్పటికీ మనం ఆడిన విధానం గురించి చర్చించుకుంటూనే ఉన్నారు. ఆ రీతిలో మనం అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాం. మరోసారి అందరికీ ధన్యవాదాలు. అందరూ జాగ్రత్తగా ఉండండి. దయచేసి ఇలా బాధగా ఉండకండి. మనం ఫైనల్స్ ఆడాం. ఇది ఇతర గేమ్స్‌లా మాములు మ్యాచ్ కాదు. లీగ్‌లోని ఇతర జట్లు కూడా ఈ మ్యాచ్‌ను చూశాయి. థ్యాంక్యూ త్వరలో మళ్లీ కలుస్తాను’అని కావ్యా మారన్ చెప్పుకొచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement