ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆరంభమైన నాటి నుంచి రాయల్స్ చాలెంజర్స్ తరఫునే ఆడుతున్నాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. 2013లో కోహ్లి ఆర్సీబీ పగ్గాలు చేపట్టాడు. తాము జట్టుగా ప్రతిసారి మేం మనసు పెట్టి ఆడుతున్నామన్నాడు కోహ్లీ. ఇంతవరకు ఎక్కడా రాజీపడలేదు. అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికే కృషి చేశామని తెలిపారు. అయితే, ఇంతవరకు మేం ఒక్క టైటిల్ కూడా సాధించలేదన్న కారణంగా నేను ఆర్సీబీని వీడిపోవాలని అనుకోలేదన్నాడు. నిజానికి నాపై వాళ్లు ఎప్పుడూ ఒత్తిడి పెట్టలేదు. ఫ్రాంఛైజీని వీడేలా మాట్లాడలేదు కూడా. మా మధ్య అసలు అలాంటి సంభాషణే జరుగలేదు. నాకు ఇక్కడ ఉన్నంత సౌలభ్యం మరెక్కడా ఉండదని చెప్పగలను. ఆర్సీబీతో అనుబంధం అద్భుతం అని చెప్పుకొచ్చాడు.
ఆర్సీబీ ఇప్పటివరకు మూడుసార్లు రన్నరప్‌గా నిలిచిందే తప్ప ఒక్కసారి కూడా ఐపీఎల్ విజేతగా నిలవలేదు. కోహ్లి సహా క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేక చతికిలపడింది. గతేడాది ప్లే ఆఫ్‌నకు అర్హత సాధించిన ఆర్సీబీ, ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడి లీగ్ నుంచి నిష్క్రమించింది. అయితే, ఈసారి కప్ కొట్టాలన్న కసి మీద కోహ్లి సేన, డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో ఆడనున్న తొలి మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి టోర్నీలో శుభారంభం చేయాలని భావిస్తోంది. ఇక గత కొన్నిరోజులుగా టీమిండియా తరఫున మ్యాచ్‌లు ఆడుతూనే ఉన్నామన్న కోహ్లి.. ఆ ఫాం ఇక్కడ పనికివస్తుందని అభిప్రాయపడ్డాడు.