Saturday, January 18, 2025

విరాట్ కోహ్లీకి గాయం..

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ గాయపడ్డాడు. మెడ కండరాల గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి కోహ్లి ఇంజక్షన్ కూడా తీసుకున్నాడని ఓ స్పోర్ట్స్ జర్నలిస్ట్ సోషల్ మీడియాలో వెల్లడించాడు. అయితే ఈ గాయం నేపథ్యంలో కోహ్లీ రంజీ ట్రోఫీ ఆడతాడా? లేదా? అనే సందేహం ఉందని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు రంజీ జట్టుకు విరాట్ కోహ్లీని ఎంపిక చేసేందుకు ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ సన్నాహాలు చేస్తోంది. ఆడకపోతే జట్టుతో కలిసి నడుస్తానని, గాయం నుంచి కోలుకోకపోతే ప్రాక్టీస్ కే పరిమితమవుతాడని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ వర్గాలు తెలిపాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముందు కోహ్లీ గాయపడ్డాడనే వార్తలు అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

టీమిండియా వరుస ఓటముల నేపథ్యంలో ఆటగాళ్లు క్రమశిక్షణతో ఉండేందుకు బీసీసీఐ 10 కఠిన నిబంధనలను రూపొందించింది. ప్రతి ఆటగాడు అందుబాటులో ఉన్నప్పుడు దేశవాళీ క్రికెట్ ఆడాలని స్పష్టం చేసింది. దాంతో భారత సీనియర్ ఆటగాళ్లంతా రంజీ ట్రోఫీ సెకండ్ ఫేజ్ ఆడేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే రోహిత్ శర్మ, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్‌లు ఆయా రాష్ట్రాల తరఫున రంజీ ట్రోఫీలో బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు.

విరాట్ కోహ్లీ చివరిసారిగా 2012లో రంజీ ట్రోఫీ ఆడాడు. గత 13 ఏళ్లుగా అతను దేశవాళీ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. కోహ్లీ గాయాన్ని పరిగణలోకి తీసుకొని బీసీసీఐ మినహాయింపు ఇస్తుందా? లేక ఆడమని పట్టుబడుతుందా? అనేది చూడాలి. ఏది ఏమైనా ఇప్పటి వరకు కోహ్లీ గాయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. అంతకు ముందు ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌లో ఆడే జట్టునే ఛాంపియన్స్ ట్రోఫీలో కొనసాగించే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement