వినేష్ ఫోగట్ వ్యవహారంలో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఎ) అధ్యక్షురాలు పీటీ ఉష సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐఓఏ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దిన్షా పార్దివాలపై వచ్చిన విమర్శలను ఆమె తప్పుబట్టారు. ఈ విషయంలో ఐఓఏ వైద్య బృందం తప్పిదం ఏ మాత్రం లేదని అన్నారు.
వినేష్ ఫోగట్‌తో పాటు ఆమె వ్యక్తిగత కోచ్‌లు, సిబ్బంది చేసిన తప్పిదం కారణంగానే ఈ సమస్య ఏర్పడిందని తెలిపారు. ఐఓఏ వైద్య బృందం… ఆటగాళ్ల గాయాల నుంచి కోలుకొనేలా చేయడంతో పాటు ఇంజూరీ మేనేజ్‌మెంట్‌పై అవగాహన కల్పిస్తుందని, ఆటగాళ్ల బరువు పెరగడం, తగ్గడం వారికి సంబంధం లేని వ్యవహారమని స్పష్టం చేసింది.
‘రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, జూడో వంటి వెయిట్ కేటగిరి సంబంధించి క్రీడల్లో అథ్లెట్లు, కోచ్‌లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉంటాయి. బరువు, ఫిట్‌నెస్ తదితర అంశాల్లో వారిదే పూర్తి బాధ్యత. ఇందులో ఐఓఏ మెడికల్ టీమ్ చేసేదేమీ ఉండదు అని తెలిపింది.
వినేష్ ఫోగట్ అనర్హత మమ్మల్ని బాధించింది. అయితే, ఐఓఏ వైద్య బృందాన్ని విమర్శించడం సరికాదు. డాక్టర్ పార్టివాలాను టార్గెట్ చేయడం, ట్రోల్ చేయడం మంచిది కాదు. ఈ ట్రోల్స్, విమర్శలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్‌లో మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. ఇప్పటికే వాదనలు ముగిశాయి. ఆగస్టు 13 సాయంత్రం 6 గంటల లోపు తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది’ ఐఓఏ తరఫున పీటీ ఉష ఓ ప్రకటనలో తెలిపారు.