Friday, November 22, 2024

Wrestling | వినేష్ ఫొగ‌ట్ రిటైర్మెంట్ వెన‌క్కి..

పారిస్ ఒలింపిక్స్ 2024లో అనర్హత వేటుకు గురైన భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్.. సోషల్ మీడియా వేదికగా ఉద్వేగభరిత పోస్ట్‌ను పంచుకుంది. పారిస్ నుంచి భారత్‌కు తిరిగొచ్చే క్రమంలో ఈ పోస్ట్ పెట్టింది. తన లక్ష్యం ఇంకా పూర్తి కాలేదని, తన భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తుందని చెప్పుకొచ్చింది.

మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఈవెంట్‌లో పోటీ పడిన వినేష్ ఫోగట్ అసాధారణ ప్రదర్శనతో ఫైనల్ చేరింది. తుది పోరుకు ముందు 100 గ్రాముల అధిక బరువు ఉందనే కారణంతో డిస్‌క్వాలిఫై అయ్యింది. దాంతో ఆమెకు ఏ పతకం రాలేదు. దీనిపై ఆమె న్యాయపోరాటం చేసినా ఫలితం లేకపోయింది.

ఇక డిస్‌క్వాలిఫై అయిన బాధలో వినేష్ ఫోగట్ రిటైర్మెంట్ ప్రకటించింది. తాజా పోస్ట్‌లో 2032 వరకు ఆడే సత్తా తనకు ఉందని పేర్కొంది. దాంతో వినేష్ ఫోగట్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంద‌ని అనుకుంటున్నారు.

‘ఇక్కడితో నా పోరాటాన్ని ఆపను. ప్రస్తుతం నా బ్యాడ్ టైమ్ నడుస్తోంది. కోట్లాది భారతీయులు, నా బృందం, కుటుంబం అనుకున్న లక్ష్యం పూర్తి కాలేదు. ఇకపై పరిస్థితులు మునుపటిలా ఉండవు. 2032 వరకు నాకు ఆడే సత్తా ఉందేమో అనుకుంటున్నా. కానీ భవిష్యత్ ఎలా నిర్ణయిస్తోంది తెలియదు. కానీ నమ్మినదాని గురించి పోరాటం మాత్రం ఆపను’అని ఎక్స్‌వేదికగా రాసుకొచ్చింది. కోచ్ వోలర్, టీమ్ డాక్టర్ దిన్షా పర్థీవాలా పట్టుదల వల్లే ఒలింపిక్స్ వెళ్లగలిగానని చెప్పిన వినేష్.. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement