ఏసీసీ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024 టోర్నీలో పాకిస్థాన్-ఏ పోరాటం ముగిసింది. నేడు శ్రీలంకతో జరిగిన తొలి సెమీఫైనల్లో పాక్ – ఏ ఓటమిపాలైంది. ఈ కీలక మ్యాచ్ లో పాకిస్థాన్ – ఏపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన శ్రీలంక – ఏ జట్టు ఫైనల్స్ కు చేరింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్-ఏ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 135 పరుగులు చేసింది.
ఓపెనర్ ఒమైర్ యూసఫ్ (46 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 68) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. మరే బ్యాటర్ కూడా 20 పరుగులు చేయలేదు. శ్రీలంక బౌలర్లలో దుషాన్ హేమంత (4/21) నాలుగు వికెట్లు తీయగా.. నిపున్ రన్సికా, ఇషాన్ మలింగా తలో రెండు వికెట్లు తీసారు.
అనంతరం లక్ష్యాన్ని ఛేదించిన శ్రీలంక-ఎ 16.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసి.. ఈజీగా విక్టరీ సాధించింది. అహన్ విక్రమసింఘే (46 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 52 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో శ్రీలంక-ఏ విజయంలో కీలక పాత్ర పోషించాడు. లాహిరు ఉడానా (20 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 43) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పాకిస్థాన్ బౌలర్లలో సుఫియన్ ముఖీమ్, అబ్బాస్ అఫ్రిది తలో వికెట్ తీసారు. కాగా, ప్రస్తుతం భారత్ – అఫ్గానిస్థాన్ మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతొంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టుతో శ్రీలంక ఆదివారం ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.