Friday, November 8, 2024

WPL : నాలుగు అప‌జ‌యాల త‌ర్వాత విజ‌యం.. బెంగుళూరుపై గుజ‌రాత్ గెలుపు

గుజరాత్‌ జెయింట్స్‌కు ఎట్టకేలకు ఓ విజయం సాధించింది.. మహిళల ప్రిమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) రెండో సీజన్‌లో ఆడిన తొలి నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన ఆ జట్టు గ‌త రాత్రి జ‌రిగిన మ్యాచ్ లో అదరగొట్టింది. ఆల్‌రౌండ్‌ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ 19 పరుగుల తేడాతో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై గెలిచింది.

- Advertisement -

బెత్‌ మూనీ (85 నాటౌట్‌; 51 బంతుల్లో 12×4, 1×6), లారా వోల్వార్ట్‌ (76; 45 బంతుల్లో 13×4) చెలేగడంతో మొదట గుజరాత్‌ 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఎడాపెడా బౌండరీలు బాదేసిన మూనీ, వోల్వార్ట్‌ జంట తొలి వికెట్‌కు 140 పరుగులు జోడించింది. వోల్వార్ట్‌ ఔయ్యాక లిచ్‌ఫీల్డ్‌ (18)తో మూనీ మరో 52 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పింది.

లక్ష్య ఛేదనలో బెంగళూరు 8 వికెట్లకు 180 పరుగులే చేయగలిగింది. జార్జియా వేర్‌హామ్‌ (48; 22 బంతుల్లో 6×4, 2×6) చివర్లో చెలరేగినా ఫలితం లేకపోయింది. రిచా ఘోష్‌ 30 పరుగులు చేసింది. బెంగళూరు ఏ దశలోనూ రేసులో ఉన్నట్లు కనపడలేదు. ఆ జట్టు క్రమం తప్పకుండా వికెట్లు పోవడంతో సాధించాల్సిన రన్‌రేట్‌ కూడా పెరుగుతూ పోయింది. ఆష్లీ గార్డ్‌నర్‌ (2/23), కేథరిన్‌ బ్రైస్‌ (1/26) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి ప్రత్యర్థి బ్యాటర్లకు కళ్లెం వేశారు. బెత్‌ మూనీకి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. ఆరు మ్యాచ్‌ల్లో బెంగళూరుకు ఇది మూడో పరాజయం.

Advertisement

తాజా వార్తలు

Advertisement