వెటోరి చెప్పాడు… పాటించాం…ప్యాట్ కమిన్స్
లెఫ్టార్మ్ స్పిన్నర్ షెహ్బాజ్ అహ్మద్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దించడమే తమ విజయానికి కలిసొచ్చిందని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. షెహ్‌బాజ్‌ను ఆడించడం తమ కోచ్ డానియల్ వెటోరి నిర్ణయమన్నాడు. షెహ్బాజ్తో పాటు అభిషేక్ శర్మ సూపర్ బౌలింగ్‌తో సత్తా చాటారని కొనియాడాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో శుక్రవారం జరిగిన క్వాలిఫయర్-2లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 36 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ఫైనల్ చేరిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది.
ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన ప్యాట్ కమిన్స్.. తమ స్పిన్నర్ల అసాధారణ ప్రదర్శనే గెలిచేలా చేసిందన్నాడు. ‘ఈ సీజన్లో మా కుర్రాళ్లు అదరగొట్టారు. ఈ సీజన్ ప్రారంభంలో ఫైనల్ చేరాలని మేం పెట్టుకున్న లక్ష్యాన్ని అందుకున్నాం. మా బ్యాటింగే మా బలమని మాకు తెలుసు. జట్టులో ఉన్న సీనియర్ ఆటగాళ్లను కూడా మేం తక్కువ అంచనా వేయలేదు. టైటిల్ గెలవడం భువీ, నట్టూ, ఉనాద్కత్ డ్రీమ్. దాంతో నా పని మరింత సులువు అయ్యింది. షేహ్బాజ్ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించే నిర్ణయం మా కోచ్ డానియల్ వెటోరిదే. లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన అతను మరో లెఫ్టార్మ్ స్పిన్నర్ కావాలనుకున్నాడు. అభిషేక్ శర్మ ప్రదర్శన మాత్రం మాకు సర్ప్రైజ్.
కుడిచేతి ఆటగాళ్లను ఇబ్బంది పెట్టేందుకు అతన్ని బరిలోకి దించాం. అతను అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ ఇద్దరూ మిడిల్ ఓవర్లలో మ్యాచ్‌ను మా వైపు తిప్పారు. ఈ వికెట్‌పై 170 పరుగుల లక్ష్యం చేధించడం చాలా కష్టం. కొన్ని వికెట్లు తీస్తే మ్యాచ్‌పై పట్టు సాధించవచ్చని ముందే అనుకున్నాం. పిచ్ పరిస్థితుల గురించి నేను పెద్దగా పట్టించుకోను. ప్రతీ వారం పరిస్థితులు మారుతూనే ఉంటాయి. మా విజయం కోసం ఫ్రాంచైజీ తరఫున 60-70 మంది కష్టపడుతున్నారు. మా లక్ష్యానికి అడుగు దూరంలో ఉన్నాం. ఆ మ్యాచ్‌లో కూడా విజయాన్ని అందుకుంటామని ఆశిస్తున్నా ‘అని కమిన్స్ చెప్పుకొచ్చాడు.
షెహ్బాజ్ అహ్మద్(3/23), అభిషేక్ శర్మ(2/24) సంచలన బౌలింగ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇదే వేదికపై ఆదివారం జరిగే ఫైనల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆరెంజ్ ఆర్మీ అమీతుమీ తేల్చుకోనుంది.