ఈ సీజన్‌లో చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ‘యుఎస్ ఓపెన్’ నేడు ఆరంభం కానుంది. నేటి నుంచి మెయిన్ డ్రా మ్యాచ్‌లు జరగనున్నాయి. పురుషులు, మహిళల సింగిల్స్‌లో ఎంతోమంది స్టార్ ప్లేయర్లు ఉన్నా.. అందరి దృష్టి మాత్రం సెర్బియా యోధుడు, రికార్డుల రారాజు నొవాక్ జకోవిచ్‌పైనే ఉంది. జకో డిఫెండింగ్ ఛాంపియన్ టైటిల్ నిలబెట్టుకుంటాడా?, 25వ విజయంతో మార్గరెట్ కోర్ట్ (24)ను వెనక్కి నెడతాడా? అని ఫాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచిన పురుష టెన్నిస్ ఆటగాడిగా నొవాక్ జకోవిచ్ రికార్డు నెలకొల్పాడు. ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్ 2024లో గోల్డ్ మెడల్ గెలిచి.. తన సుదీర్ఘ స్వర్ణ కలను సాకారం చేసుకున్నాడు. జకో ఎన్నో విజయాలు, ఘనతలు సాధించాడు. ఇక అతడిని 25వ టైటిల్ ఘనత మాత్రమే ఊరిస్తోంది. ఇది సాధించి ఓవరాల్‌గా అత్యధిక గ్రాండ్‌స్లామ్ ట్రోఫీలు సొంతం చేసుకున్న టెన్నిస్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాలని చూస్తున్నాడు.
యుఎస్ ఓపెన్ 2024 తొలి రౌండ్లో 138వ ర్యాంకర్ అల్బాట్ (మోల్డోవా)తో జకోవిచ్ తలపడనున్నాడు. తొలి రౌండ్లో జకోవిచ్‌కు విజయం ఖాయం అయినా.. ఆపై కఠిన పరీక్ష తప్పకవపోవచ్చు. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ గెలిచిన స్పెయిన్ యువ ఆటగాడు అల్కరాస్ ప్రధాన పోటీదారుడిగా ఉన్నాడు. టాప్‌సీడ్ సినర్ (ఇటలీ) నుంచి కూడా జకోకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. అలానే మెద్వెదెవ్, జ్వెరెవ్ కూడా రేసులో ఉన్నారు. ఈ ఏడాది ఒక్క గ్రాండ్‌స్లామ్ కూడా గెలవని జకో.. ఇప్పుడు ఫామ్ మీదుండడం కలిసొచ్చే అంశం. పారిస్ ఒలింపిక్స్‌లో అల్కరాస్‌ను ఓడించాడు.