భద్రాచలం, జనవరి 28 (ఆంధ్రప్రభ): అండర్-19 మహిళల వరల్డ్ కప్ పోటీల్లో భద్రాచలానికి చెందిన భారత్ బ్యాటర్ గొంగడి త్రిష స్కాట్లాండ్ పై 110 పరుగులు, 59 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్స్ లతో అండర్ 19 వరల్డ్ కప్ లో సెంచరీ చేసిన తొలి బ్యాటర్ గా రికార్డ్ సృష్టించింది. 53 బంతుల్లోనే శతకం చేసిన ఆమె, 110 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ 20ఓవర్లలో వికెట్ నష్టానికి 208పరుగులు చేయగా, అందులో త్రిష 110 పరుగులతో సగం స్కోర్ తానే చేసింది. ప్రపంచకప్ పోటీల్లో త్రిష తనదైన ఆటతో జట్టుకు మూల స్తంభంగా నిలుస్తుంది.
భద్రాచలంలో వెల్లువెత్తిన సంబరాలు…
త్రిష ప్రతిభకు భద్రాద్రి వాసులు ఆనందంలో అభినందన ర్యాలీ ఏర్పాటు చేశారు. గొంగడి త్రిష తండ్రి రామిరెడ్డి స్థానికంగా అందరికీ సుపరిచితుడు. త్రిష కూడా తన బాల్యంలో ఒక్కడే చదువుకుంది. ఈ క్రమంలో నెహ్రూ కప్ క్రికెట్ వ్యవస్థాపకులు తోటమల్ల బాలయోగి మంగళవారం సాయంత్రం 4గంటలకు, భద్రాచలం క్రికెట్ గ్రౌండ్ నుంచి మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నారని, ఈ ర్యాలీలో పట్టణ ప్రజలు, పట్టణ ప్రముఖులు, పెద్దలు, వివిధ వ్యాపార వర్గాల వారు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు, వివిధ ప్రభుత్వ ఉద్యోగులు, క్రికెటర్స్, క్రికెట్ అభిమానులు, ప్రెస్, ఇతర అన్నివర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.