Saturday, January 25, 2025

Ranji Trophy | అజేయ శతకం.. ముంబైని ఆదుకున్న శార్దూల్ !

ప్రతిష్టాత్మక దేశ‌వాలి రంజీ ట్రోఫీ 2024-25లో టీమిండియా ఆల్‌రౌండర్, ముంబై క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ జోరు కొనసాగుతోంది. జమ్ముకశ్మీర్ తో జరుగుతున్న మ్యాచ్ లో.. 101 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన ముంబై జట్టును శార్దూల్ ఠాకూర్ మరోసారి ఆదుకున్నాడు.

8వ స్థానంలో క్రీజులోకి వచ్చిన శార్దూల్ 105 బంతుల్లో 15 ఫోర్లతో అసాధారణ సెంచరీ నమోదు చేశాడు. శార్దూల్ తో పాటు తనూష్ కోటియన్ హాఫ్ సెంచ‌రీతో రాణించాడు. ఈ ఇద్దరూ ఇప్పటికే 8వ వికెట్‌కు 173 పరుగులు అజేయంగా జోడించారు.

దీంతో ముంబై భారీ స్కోర్ దిశగా సాగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ముంబై జ‌ట్టు 67 ఓవర్లలో 7 వికెట్లకు 274 పరుగులు చేసింది. ప్ర‌స్తుతం క్రీజులో శార్దూల్ ఠాకూర్ (119 బంతుల్లో 17 ఫోర్లతో 113), తనూష్ కోటియన్(119 బంతుల్లో 6 ఫోర్లతో 58 బ్యాటింగ్) ఉన్నారు.

ఈ ఇన్నింగ్స్ లో టాపార్డర్ బ్యాటర్లు యశస్వి జైస్వాల్ (26), రోహిత్ శర్మ (28) పరుగులు చేశారు. జమ్మూ కశ్మీర్ బౌలర్లలో ఆకిబ్ నబీ (3/69) మూడు వికెట్లు తీయగా.. ఉమన్ నజీర్ మిర్(2/76), యుధ్‌వీర్ సింగ్(2/63) రెండేసి వికెట్లు తీసారు.

- Advertisement -

మ్యాచ్ జరిగిందిలా…

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 120 పరుగులకు ఆలౌటైంది. ఆ మ్యాచ్‌లోనూ శార్దూల్ ఠాకూర్ (57 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 51), తనుష్ కొటియన్ (36 బంతుల్లో 5 ఫోర్లతో 26) రాణించ‌గా.. మిగతా ఆటగాళ్లు ఘోరంగా విఫలమయ్యారు.

స్టార్ ప్లేయ‌ర్లు రోహిత్ శర్మ(3), యశస్వి జైస్వాల్(4), అజింక్యా రహానే(12), శ్రేయాస్ అయ్యర్(11), శివమ్ దూబే(0) ప‌రుగుల‌కే పెవిలియ‌న్ చేరారు. ఈ క్రమంలో 8వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన శార్దూల్ ఠాకూర్… తనుష్ కొటియన్ తో కలిసి 8వ వికెట్ కు 63 పరుగులు జోడించాడు.

అనంత‌రం బ్యాటింగ్ చేప‌ట్టిన జమ్మూ కశ్మీర్ త‌మ తొలి ఇన్నింగ్స్‌లో 41.3 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌటైంది. శుభమ్ ఖజురియా (53), అబిద్ ముస్తాక్ (44) రాణించారు. ముంబై బౌలర్లలో మోహిత్ అవస్థి(5/52) ఐదు వికెట్లు తీయగా.. శార్దూల్ ఠాకూర్ (2/39), శామ్స్ ములానీ(2/61) రెండేసి వికెట్లు పడగొట్టారు. శివమ్ దూబేకి ఓ వికెట్ దక్కింది.

ఆ తర్వాత 86 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై జ‌ట్టు… 101 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. దాదాపు ఆలౌట్ దిశగా పయనిస్తున్న జట్టును.. శార్దూల్ ఠాకూర్ అద్భుత సెంచరీతో ఇన్నింగ్స్ నిల‌బెట్టాడు. దీంతో ముంబై రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ముంబై ఆధిక్యం ఇప్పటికే 188 పరుగులకు చేరుకుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ముంబై జ‌ట్టు 67 ఓవర్లలో 7 వికెట్లకు 274 పరుగులు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement