సొంతగడ్డపై వరుస విజయాలతో దూసుకువెళుతున్న రోహిత్‌సేన నేడు మరో రసవత్తర పోరుకు సిద్ధమైంది. శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు రెండో టీ20 ధర్మశాల వేదికగా జరగనుంది. రాత్రి 7గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. తొలి టీ20లో ఘనవిజయం సాధించిన టీమిండియా అదే జోరుతో రెండో టీ20లోనూ గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ లక్ష్యంగా టీమిండియా తమ బలాన్ని పరీక్షించుకోవాలని యోచిస్తోంది. దీనిలో భాగంగా యువ ఆటగాళ్లకు సిద్ధం చేయనుంది. కోహ్లీ, పంత్‌కు విశ్రాంతినివ్వగా గాయం నుంచి కోలుకున్న రవీంద్ర జడేజా, బుమ్రా అందుబాటులోకి వచ్చారు. టీమిండియా ఓపెనింగ్ జోడీ రోహిత్‌శర్మ-ఇషాన్ కిషన్ తొలి టీ20లో శుభారంభాన్ని అందించి పటిష్ట పునాది వేయడంతో ఈ జోడీనే మరోసారి బరిలోకి దిగనుంది. రుతురాజ్ గైక్వాడ్ గాయంతో దూరమవడంతో రెండో టీ20లో మయాంక్ అగర్వాల్ తుదిజట్టులో చేరనున్నాడు. వరుసగా రెండు రోజులు పాటు జరిగే చివరి రెండు టీ20లకు రుతురాజ్ దూరమయ్యాడు. ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. కుడిచేతి మణికట్టు గాయంతో రుతురాజ్ టీ20 సిరీస్‌కు దూరమైనట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌లో తలపడే టీమిండియా ఆటగాళ్లు చండీగఢ్‌లో క్వారంటైన్‌లో ఉన్నారు. టీ20 సిరీస్ అనంతరం మయాంక్ అగర్వాల్ కూడా టెస్టు జట్టులో చేరనున్నాడు.
ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సిరీస్‌లో సూర్యకుమార్, దీపక్‌చాహర్ గాయాలతో దూరమవగా రుతురాజ్ కూడా దూరమయ్యాడు. కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్ వేదికగా విండీస్‌తో జరిగిన టీ20లో సూర్య, చాహర్ గాయపడ్డారు. వీరిస్థానంలో బోర్డు ఎవరినీ భర్తీ చేయలేదు. పేసర్లు హర్షల్‌పటేల్, బుమ్రా, భువనేశ్వర్‌తోపాటు వెంకటేశ్ అయ్యర్ కూడా పేస్‌దళంలో ఉండగా, స్పిన్నర్లుగా చాహల్, రవీంద్ర జడేజా ఆడనున్నారు. ధర్మశాల పిచ్ పేస్‌కు అనుకూలించనుండటంతో హుడా బెంచ్‌కే పరిమితం కానున్నాడు. మరోవైపు ఆసీస్‌చేతిలో ఓటమితో కుదేలైన శ్రీలంక జట్టు ఇంకా తేరుకోలేదు. రెండో టీ20లోనైనా గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని లంకేయులు భావిస్తున్నారు. శ్రీలంక స్పిన్నర్ మహేశ్ తీక్షణ గాయంతో మిగిలిన రెండు టీ20లకు దూరమయ్యాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..