Thursday, November 14, 2024

Breaking | ఫ‌లించిన తిల‌క్ పోరాటం.. స‌ఫారీల‌పై టీమిండియా విజ‌యం

ఆంధ్రప్రభ, స్పోర్ట్స్​ డెస్క్​: దక్షిణాఫ్రికా గ‌డ్డ‌పై సూర్య ద‌ళం జూలు విదిలించింది. సంజూ శాంస‌న్ మెరుపు సెంచ‌రీని మ‌రువ‌క‌ముందే మ‌రో భార‌త కుర్రాడు తిల‌క్ వ‌ర్మ‌ శ‌త‌క గ‌ర్జ‌న చేశాడు. సిరీస్‌లో ముందంజ వేయాలంటే గెల‌వ‌క త‌ప్ప‌ని మ్యాచ్‌లో తెలుగు కుర్రాడు తిల‌క్ వ‌ర్మ‌(107 నాటౌట్) సుడిగాలి ఇన్నింగ్స్‌తో విరుచుకుప‌డ్డాడు. ఇక‌.. బౌలింగ్‌లోనూ భార‌త కుర్రాళ్లు అదుర్స్ అనిపించారు. అయితే.. స‌ఫారీలు ఏమాత్రం వెనుకంజ‌వేయ‌కుండా పోరాట ప‌టిమ చూపారు. కాగా, సౌతాఫ్రికా జ‌ట్టు 220 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించ‌డంలో వెన‌క‌బ‌డింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 208 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో టీమిండియా 11 ప‌రుగుల తేడాతో సఫారీలపై విజ‌యం సాధించింది.. 4 మ్యాచ్​ల టీ20 సిరీస్​లో భారత్​ రెండు విజయాలు నమోదు చేయగా.. సౌతాఫ్రికా ఒక మ్యాచ్​ గెలుచుకుంది.. మరో మ్యాచ్​ 15వ తేదీన జరగనుంది..

- Advertisement -

ఇక‌.. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా సెంచూరియ‌న్‌లో బౌండ‌రీల వ‌ర్షం కురిపించింది. టీ20ల్లో తిల‌క్‌వ‌ర్మ తొలి సెంచ‌రీతో చెల‌రేగాడు. ద‌క్షిణాఫ్రికా బౌలర్ల‌కు చుక్క‌లు చూపించి జ‌ట్టుకు కొండంత స్కోర్ అందించాడు. ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ‌(50) సైతం చిత‌క్కొట్ట‌గా.. టీమిండియా ప్ర‌త్య‌ర్థికి 220 ప‌రుగుల‌ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

కాగా, మూడో టీ20లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ మ‌ర్క్‌ర‌మ్ బౌలింగ్ తీసుకున్నాడు. అతడి నిర్ణయం స‌రేందే అని చాటుతూ మార్కో జాన్సెన్ తొలి ఓవ‌ర్లోనే డేంజ‌ర‌స్ సంజూ శాంస‌న్‌(0)ను బౌల్డ్ చేశాడు. 3 బంతులాడిన శాంస‌న్ డ‌కౌట్‌గా వెనుదిరిగాడు. దాంతో, ప‌రుగుల ఖాతా తెర‌వ‌కముందే టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది, అయితే.. తెలుగు కుర్రాడు తిల‌క్ వ‌ర్మ‌(107 నాటౌట్), అభిషేక్ శ‌ర్మ‌(50)లు దంచేశారు. స‌ఫారీ పేస‌ర్ల‌పై ఎదురుదాడికి దిగితూ స్క్వేర్ దిశ‌గా బౌండ‌రీల మోత మోగించారు. దాంతో, భార‌త జ‌ట్టు స్కోర్ ప‌వ‌ర్ ప్లేలోనే 70 దాటేసింది.

కేశ‌వ్ మ‌హ‌రాజ్ బౌలింగ్‌లో భారీ సిక్స‌ర్ బాదిన అభిషేక్.. సింగిల్ తీసి హాఫ్ సెంచ‌రీ సాధించాడు. రెండో వికెట్‌కు 107 ప‌రుగులు క‌లిపిన ఈ జోడీని మ‌హ‌రాజ్ విడ‌దీశాడు. క్రీజు వదిలి ముందుకొచ్చిన అభిషేక్‌ను క్లాసెన్ స్టంపౌట్ చేశాడు. ఆ కాసేప‌టికే సూర్య‌కుమార్ యాద‌వ్(1), హార్దిక్ పాండ్యా(18)లు ఎక్కువ సేపు క్రీజులో నిలువ‌లేదు. అయినా స‌రే రింకూ సింగ్(8) జ‌త‌గా తిల‌క్ ఇన్నింగ్స్ నిర్మించాడు. సిప‌ల‌మ్ వేసిన 19వ ఓవ‌ర్లో బౌండ‌రీతో తిల‌క్ తొలి టీ20 శ‌త‌కం సాధించాడు. ఆఖ‌రి ఓవ‌ర్లో 4 ప‌ర‌గులు రావ‌డంతో భార‌త జ‌ట్టు స‌ఫారీల‌కు భారీ ల‌క్ష్యాన్ని నిర్దేశించగ‌లిగింది.

ఇక‌.. భార‌త భౌల‌ర్ల‌లో అర్ష‌దీప్‌సింగ్ 3, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి 2 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. పాండ్యా, అక్ష‌ర్ ప‌టేల్ చేరో వికెట్ తీశారు. కాగా, రియాన్ రికిల్ట‌న్ (20), హెన్రిక్స్ (21), మార్క్ర‌మ్ (29), స్ట‌బ్స్ (12), క్లాసెన్ (41), మిల్ల‌ర్ (18), జాన్‌సెన్ (54) ప‌రుగులు చేసి అవుట‌య్యారు. కోయిట్జీ 2, సిమిలేన్ 5 ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement