టీ20 ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి దక్షిణాఫ్రికా ఫైనల్‌కు చేరింది. సెమీఫైనల్ మ్యాచ్‌లో ప్రత్యర్థి అఫ్గానిస్థాన్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది. 57 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం ఒకే ఒక్క వికెట్ కోల్పోయి ఛేదించింది. మ్యాచ్ అనంతరం దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్‌క్రమ్ మాట్లాడుతూ.. టీ20 ప్రపంచకప్ సిరీస్‌లో తొలిసారిగా ఫైనల్‌కు చేరడం చాలా ఆనందంగా ఉందన్నాడు. తాను కీలక ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. ఈ గెలుపు కేవలం తనొక్కడి వల్లే సాధ్యం కాలేదని ఇదంతా జట్టు విజయమేనని చెప్పుకొచ్చాడు.
”తెలివైన బౌలింగ్ చేసి.. సరైన సమయాల్లో కీలక వికెట్లు పడగొట్టాం. పిచ్ చాలా కఠినంగా ఉంది. బ్యాటింగ్ చేయడం సవాల్‌గా మారింది. మాకు కొంత అదృష్టం కూడా కలిసొచ్చింది. వెంటవెంటనే వికెట్లు తీయడం మమ్మల్ని సులువుగా విజయతీరాలకు చేర్చింది. కప్‌ను సొంతం చేసుకోవాలంటే ఇంకో మెట్టు ఎక్కాల్సిఉంది.
ఇలాంటి సందర్భం ఇప్పటివరకు మాకు రాలేదు. అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటాం. ఫైనల్ మ్యాచ్ కోసం భయపడటం లేదు. ఈ విజయమే మాకు ఎంతో గొప్ప. జట్టులో ప్రపంచస్థాయి ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. విజయం సాధించాలంటే అందరి సమష్టి కృషి అవసరం. ఫైనల్ మ్యాచ్‌లో అలాంటి ప్రదర్శన చేస్తాం” అని మార్‌క్రమ్ చెప్పుకొచ్చాడు.
పిచ్ ను తక్కువ అంచనా వేశాం..
అఫ్గాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ మాట్లాడుతూ.. పిచ్ సవాల్‌గా మారిందన్నాడు. మరికాస్త ప్రదర్శన చేయాల్సి ఉన్నప్పటికీ పిచ్ పరిస్థితులు అనుకూలంగా లేవన్నాడు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, అదే.. టీ20 క్రికెట్ అని అన్నాడు. ” దక్షిణాఫ్రికా బాగా బౌలింగ్ చేసింది. ముజీబ్ గాయపడటం ఓ రకంగా మాకు దురదృష్టమే. మా పేసర్లతోపాటు నబీ కూడా చాలా తెలివిగా బౌలింగ్ చేశారు. ఓటమిని అంగీకరిస్తున్నాం.
ఇది మాకు ప్రారంభం మాత్రమే. ఎలాంటి జట్టునైనా ఎదుర్కోగలమన్న విశ్వాసం, నమ్మకం కలిగాయి. మా ప్రయత్నాన్ని ఎప్పుడూ కొనసాగిస్తాం. మమ్మల్ని మేం మెరుగుపరుచుకునేందుకు ఈ టోర్నీ చక్కని అవకాశాన్నిచ్చింది. మా నైపుణ్యాలను ఉపయోగించడంలో ఎక్కడ విఫలమయ్యామో గుర్తించి.. సరిదిద్దుకుంటాం. ముఖ్యంగా మిడిలార్డర్‌లో మేం మెరుగుపడాల్సి ఉంది. మరింత హార్డ్‌వర్క్ చేసి మున్ముందు సిరీస్‌లకు సిద్ధమవుతాం” అని చెప్పాడు.
వన్డే, టీ20 ప్రపంచకప్ ఫార్మాట్లలో గత 32 ఏళ్లలో దక్షిణాఫ్రికా ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి. 1992 నుంచి ఇప్పటి వరకు 8 సార్లు దక్షిణాఫ్రికా సెమీఫైనల్ వరకు వెళ్లింది. ఆస్ట్రేలియా- దక్షిణాఫ్రికా మధ్య జరిగిన 1999 వరల్డ్ కప్ సెమీస్ టైగా ముగిసింది.