రోవ్‌మన్ పోవెల్ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఓడిపోయే మ్యాచ్‌లో విజయం సాధించామని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ తెలిపాడు. వరుస వికెట్లు కోల్పోయి మ్యాచ్ చేజారుతున్న స్థితిలో రోవ్‌మన్ పోవెల్ భారీ సిక్సర్లతో జట్టును విన్నింగ్ రేసులో నిలబెట్టాడని చెప్పాడు.
ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మంగళవారం ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన సంజూ శాంసన్.. ఈ విజయంపై సంతోషం వ్యక్తం చేశాడు. ‘ఈ గెలుపు పట్ల చాలా సంతోషంగా ఉంది. మేం 6 వికెట్లు కోల్పోయిన తర్వాత కూడా విజయం దక్కడం కాస్త ఆశ్యర్యంగా ఉంది. మ్యాచ్ చేజారుతున్న స్థితిలో రోవ్‌మన్ పోవెల్ వచ్చి రెండు భారీ సిక్స్‌లు కొట్టాడు. ఆ రెండు షాట్స్ మమ్మల్ని మళ్లీ మ్యాచ్‌లో నిలబెట్టాయి. కొంచెం అదృష్టం కూడా మాకు కలిసొచ్చింది.
ఇది చాలా ఫన్నీ గేమ్. కేకేఆర్ కూడా అద్భుతంగా ఆడింది. ఈ మ్యాచ్ ఇలా జరుగుతుందని ముందే ఊహించాను. ఈ గెలుపు పట్ల చాలా ఉత్సాహంగా.. సంతోషంగా ఉంది. సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తీ నాణ్యమైన స్పిన్నర్లు. పైగా ఈ వికెట్ వారి బౌలింగ్‌కు సరిగ్గా సరిపోతుంది. ఈ ఇద్దరూ అద్భుతంగా బౌలింగ్ చేశారు.
రోవ్‌మన్ కొట్టిన రెండు సిక్స్‌లే మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచాయి. జోస్ బట్లర్ తన పని తాను చేస్తూనే ఉన్నాడు. గత 6-7 ఏళ్లుగా జట్టును గెలిపిస్తున్నాడు. టాపార్డర్‌లో ఒకరు అతనిలాంటి ఇన్నింగ్స్ ఆడటం చాలా ముఖ్యం. జోస్ బట్లర్ సెట్ అయితే మ్యాచ్ పూర్తయ్యే వరకు ఉంటాడని మా అందరికి తెలుసు.
అతను చివరి బంతి వరకు క్రీజులో ఉంటే ఎన్ని పరుగులున్నా.. ఏదో మ్యాజిక్ చేసి విజయాన్ని అందిస్తాడు.’అని సంజూ శాంసన్ కొనియాడాడు.