హెడింగ్లీ: యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. రెండు టెస్టుల్లో దెబ్బ తిన్న ఇంగ్లిష్ జట్టు.. మూడో టెస్టులో అదే దూకుడైన ఆటతీరుతో ఆస్ట్రేలియాను మూడు వికెట్ల తేడాతో మట్టికరిపించి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
ఆసీస్ నిర్దేశించిన 251 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్.. 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రెండో ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్ (75; 93 బంతుల్లో 9 ఫోర్లు), జాక్ క్రాలీ (44; 55 బంతుల్లో 5 ఫోర్లు), క్రిస్ వోక్స్ (32; 47 బంతుల్లో 4 ఫోర్లు) రాణించారు. చివర్లో మార్క్ వుడ్ (16; 8 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) మెరుపులు మెరిపించడంతో ఇంగ్లాండ్ విజయం సాధించింది.
27/0తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఇంగ్లాండ్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. డకెట్ (23)ను మిచెల్ స్టార్క్ ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపించాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన మొయిన్ అలీ (5) కూడా స్టార్క్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. నిలకడగా ఆడుతున్న జాక్ క్రాలీ.. మిచెల్ మార్ష్ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన హ్యారీ బ్రూక్.. జో రూట్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. జో రూట్ (21) కమిన్స్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరడంతో ఇంగ్లాండ్ 131 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. లంచ్ బ్రేక్ సమయానికి ఇంగ్లిష్ జట్టు 153/4తో నిలిచింది.
భోజన విరామం నుంచి రాగానే బెన్ స్టోక్స్ (13), బెయిర్ స్టో (5)లను మిచెల్ స్టార్క్ వరుస ఓవర్లలో పెవిలియన్‌కు చేర్చడంతో ఆసీస్ పైచేయి సాధించినట్లు కనిపించింది. ఈ తరుణంలో క్రిస్ వోక్స్, బ్రూక్ నిలకడగా బౌండరీలు బాదడంతో ఇంగ్లాండ్ విజయానికి చేరువైంది. కానీ, ఇంతలోనే బ్రూక్‌ను ఔట్ చేసి స్టార్క్ ఇంగ్లాండ్‌కు గట్టి షాక్ ఇచ్చాడు. దీంతో ఉత్కంఠ నెలకొంది. అప్పటికి ఇంగ్లిష్ జట్టు విజయానికి 21 పరుగులు అవసరం కాగా.. మార్క్ వుడ్ చివర్లో మెరుపులు మెరిపించడంతో ఇంగ్లాండ్ గట్టెక్కింది. మార్క్ వుడ్ కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది..