రాజ్‌కోట్ వేదికగా రేపటినుంచి (ఫిబ్రవరి 15-గురువారం) భారత్ ఇంగ్లాండ్ మద్య మూడో టెస్టు ప్రారంభం కానుంది. కాగా, ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే భారత జట్టు రాజ్‌కోట్ చేరుకుంది. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే, ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్‌ను పలు రికార్డులు ఊరిస్తున్నాయి.
ఒక్క వికెట్ తీస్తే..
రాజ్‌కోట్ టెస్టు మ్యాచులో అశ్విన్ ఒక్క వికెట్ పడగొడితే 500 వికెట్ల క్లబ్‌లో అడుగుపెట్టనున్నాడు. ఇప్పటి వరకు అశ్విన్ 97 టెస్టు మ్యాచులు ఆడాడు. 183 ఇన్నింగ్స్‌ల్లో 499 వికెట్లు పడగొట్టాడు. 34 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. కాగా.. అశ్విన్ ఒక్క వికెట్ తీస్తే.. ఐదు వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా, ఓవరాల్‌గా తొమ్మిదో క్రికెటర్‌గా రికార్డులకు ఎక్కనున్నాడు.
స్వదేశంలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా..
టెస్టు మ్యాచ్‌లలో స్వదేశంలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించేందుకు అశ్విన్‌కు మరో ఐదు వికెట్లు అవసరం. ఐదు వికెట్లు తీస్తే అనిల్ కుంబ్లే రికార్డును అశ్విన్ బద్దలు కొడుతాడు. టెస్టుల్లో సొంత గడ్డమీద కుంబ్లే 350 వికెట్లు తీయగా అశ్విన్ 346 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.
ఇంగ్లాండ్ పై వంద వికెట్లు..
ఇంగ్లాండ్ పై టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత ఆటగాళ్ల జాబితాలో ఇప్పటికే అశ్విన్ అగ్రస్థానంలో ఉన్నాడు. 97 వికెట్లు అతడు పడగొట్టాడు. మరో మూడు వికెట్లు తీస్తే ఇంగ్లాండ్ పై వంద వికెట్లు తీసిన మొదటి భారత బౌలర్‌గా రికార్డులకు ఎక్కనున్నాడు.