కొత్త సంవత్సరంలో భారత జట్టులో పలు మార్పులు జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. వన్డే సిరీస్ కోసం చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ రెండు వేర్వేరు జట్లను ఎంపిక చేయనున్నట్టు తెలుస్తోంది. శ్రీలంకతో జరగబోయే టీ 20 సిరీస్‌కు టీమ్ ఇండియా సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు ఓపెనర్ కేఎల్ రాహుల్ కూడా దూరం కానున్నట్లు సమాచారం.
రోహిత్ గాయంమానలేదు..
గాయం తీవ్రత తగ్గుముఖం పట్టకపోవడంతో రోహిత్ శర్మ టీ 20 సిరీస్‌కు అందుబాటులో ఉండే అవకాశం తక్కువేనని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. వన్డే సిరీస్‌తో తిరిగి రోహిత్ జట్టులో చేరే అవకాశం ఉందని అంటున్నారు. మెడికల్ టీమ్ నిర్ణయాన్ని అనుసరించే రోహిత్‌ను జట్టులోకి తీసుకోవడంపై ఓ క్లారిటీ రానున్నట్లు సమాచారం.
కోహ్లీకి విరామం..
శ్రీలంకతో టీ 20 సిరీస్‌కు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలిసింది. టీ 20 ప్రపంచకప్ తర్వాత కోహ్లీ గ్యాప్ లేకుండా వరుసగా సిరీస్‌లు ఆడుతూ వస్తున్నాడు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌లను దృష్టిలో పెట్టుకుని కోహ్లీకి విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
రాహుల్ పెళ్లి కారణంగా..
ఫామ్ లేమితో సతమతమవుతున్న వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై వేటుపడే అవకాశాలు కన్పిస్తున్నాయి. టీమ్ ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ శ్రీలంక సిరీస్ మొత్తానికి దూరం కానున్నట్లు తెలిసింది. జనవరిలో తన ప్రియురాలు అతియా శెట్టిని రాహుల్ పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.