Wednesday, December 4, 2024

WTC | వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్ కోసం మ్యూజిక‌ల్ చైర్

వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) 2023-25 సైకిల్‌లో టెస్టులు ముగుస్తున్న కొద్దీ ఫైనల్‌ రేసు మరింత రసవత్తరమవుతోంది. టాప్‌-2లో నిలిచేందుకు ఏకంగా ఐదు జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మరో 15 టెస్టులు మిగిలున్న ఈ సైకిల్‌లో ఇప్పటి వరకూ ఏ ఒక్క జట్టూ ఫైనల్‌ బెర్తును ఖాయం చేసుకోలేదు.

ప్రస్తుతం టీమ్‌ఇండియా అగ్రస్థానంలో కొనసాగుతున్నప్పటికీ రాబోయే టెస్టులలో గెలవడం జట్టుకు కీలకం. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్‌.. ఫైనల్‌ బెర్తు కోసం పోటీ పడుతున్నాయి.

భారత్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన కివీస్ స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌ను ఓడటం.. పెర్త్‌ టెస్టులో భారత్‌ భారీ విజయం, దక్షిణాఫ్రికా.. శ్రీలంకను చిత్తుగా ఓడించిన నేపథ్యంలో ఫైనల్‌ సమీకరణాలు మళ్లీ మారాయి.

భారత్‌కు మంచిదే..

స్వదేశంలో కివీస్‌ చేతిలో క్లీన్‌స్వీప్‌ ఎదుర్కొని ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే ముందు డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరాలంటే భారత్‌ కచ్చితంగా 4-0తో సిరీస్‌ను గెలవాల్సిన పరిస్థితి. కానీ పెర్త్‌ టెస్టులో 295 పరుగుల తేడాతో గెలిచి టీమిండియా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మళ్లీ 61.11 శాతంతో అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది.

- Advertisement -

ఈ సైకిల్‌లో మరో 4 మ్యాచ్‌లు ఆడనున్న భారత్‌.. సిరీస్‌ను 4-0, 3-1తో గెలిచినా.. 2-2తో డ్రా అయినా ఫైనల్‌ చేరే అవకాశాలున్నాయి. ఆస్ట్రేలియాను 3-1తో ఓడిస్తే భారత్‌.. 62.28 పాయింట్లతో డబ్ల్యూటీసీని ముగిస్తుంది. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ 2-2తో డ్రా అయినా టీమ్‌ఇండియా ఫైనల్‌ చేరుతుంది.

అయితే ఇలా జరగాలంటే శ్రీలంకతో జరుగుతున్న సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2-0తో గెలవాలి. ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగే రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను శ్రీలంక.. 1-0తో గెలిస్తే భారత్‌ మూడోసారి ఫైనల్‌ చేరడానికి ఆస్కారముంటుంది.

రేసులోకి వచ్చిన సఫారీలు..

డర్బన్‌ టెస్టులో లంకను చిత్తుచిత్తుగా ఓడించడం దక్షిణాఫ్రికాకు కలిసొచ్చింది. ప్రస్తుతం ఆ జట్టు భారత్‌ తర్వాత 59.26 శాతం పాయింట్లతో రెండో స్థానాన నిలిచింది. ప్రస్తుత సైకిల్‌లో ఆ జట్టు శ్రీలంకతో మరో టెస్టు, పాకిస్థాన్‌తో రెండు (రెండూ స్వదేశంలోనే) ఆడాల్సి ఉంది.

ఈ మూడింటిలో రెండు గెలిస్తే టాప్‌-2లో (ఆస్ట్రేలియా ఫలితాలపై ఇది ఆధారపడి ఉంటుంది) నిలుస్తుంది. ఒకవేళ భారత్‌.. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీని దక్కించుకుని.. స్వదేశంలో శ్రీలంక, ఆస్ట్రేలియాను మట్టికరిపిస్తే అప్పుడు టాప్‌-2 జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొనే అవకాశముంది.

ఆసీస్‌కు సంకట స్థితి..

పెర్త్‌ టెస్టు ఓటమి, సఫారీల భారీ గెలుపుతో ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్‌ అవకాశాలు దెబ్బతిన్నాయి. ఈ సైకిల్‌లో కంగారూలు మరో ఆరు మ్యాచ్‌లు (ఇండియాతో 4, శ్రీలంకతో 2) ఆడాల్సి ఉంది. వీటిలో నాలుగు మ్యాచ్‌లు గెలిస్తే ఇతర ఫలితాలతో సంబంధం లేకుండా ఆ జట్టు వరుసగా రెండోసారి ఫైనల్‌ చేరుతుంది. భారత్‌తో సిరీస్‌ను 3-2తో కోల్పోయినా శ్రీలంకను 2-0తో ఓడిస్తే ఆ జట్టు టాప్‌-2లో నిలుస్తుంది. కానీ స్పిన్‌ పిచ్‌లపై లంకేయులను నిలువరించడం అంత తేలిక కాదు.

లంకకూ ఓ అవకాశం..

సఫారీలతో తొలి టెస్టు ఓటమి లంక అవకాశాలను దెబ్బతీసినా వాళ్లకింకా తలుపులు మూసుకుపోలేదు. ఆ జట్టు మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా అందులో రెండు సొంతగడ్డపై ఆడేవే. స్వదేశంలో 1-0తో ఆసీస్‌ను నిలువరించినా ఫైనల్‌ రేసులో ఉండటానికి చాన్స్‌ ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement