Thursday, December 12, 2024

IND vs AUS | బ్యాటర్ల ఫామ్‌పై ఆందోళన.. మూడో టెస్టులో టీమిండియాలో మార్పులకు అవకాశం

భారత్‌-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్‌ 14 (శనివారం) నుంచి మూడో టెస్టు ప్రారంభం కానుంది. పెర్త్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారీ విజయం సాధించిన టీమిండియా బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో శుభారంభం చేసింది. కానీ, ఆ తర్వాత ఆడిలైడ్‌ వేదికగా జరిగిన పింక్‌ బాల్‌ (డై అండ్‌ నైట్‌) టెస్టులో మాత్రం పూర్తిగా తేలిపోయింది.

అన్ని విభాగాల్లో పైచేయి సాధించిన ఆతిథ్య ఆస్ట్రేలియా రెండో టెస్టులో 10 వికెట్లతో రోహిత్‌ సేనను చిత్తు చేసి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. బ్యాటింగ్‌ వైఫల్యం కారణంగానే భారత్‌ రెండో టెస్టులో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ప్రస్తుతం టీమిండియా బ్యాటర్ల ఫామ్‌ ఆందోళన కలిగిస్తోంది.

డబ్ల్యూటీసీ రేసులో దక్షిణాఫ్రికా..

కాగా, రెండు రోజుల్లో ఇరు జట్ల మధ్య కీలకమైన మూడో టెస్టు మొదలు కానుంది. ఇద్దరికీ ఈ మ్యాచ్‌ చాలా కీలకం. వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ బెర్తు కోసం భారత్‌-ఆసీస్‌ జట్లు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. తాజాగా ఈ రేసులో దక్షిణాఫ్రికా ఎంట్రీ ఇవ్వడంతో భారత్‌, ఆస్ట్రేలియా జట్లు టాప్‌ ప్లేస్‌ను కోల్పోయాయి. ఇటీవలే శ్రీలంకను క్లీన్‌ స్వీప్‌ చేసిన సఫారీ జట్టు డబ్ల్యూటీసీ పాయింట్స్‌ టేబుల్‌లో అగ్ర స్థానాన్ని కైవసం చేసుకుంది.

- Advertisement -

మరోవైపు కంగారూల చేతిలో రెండో టెస్టులో ఓడిన భారత్‌ మూడో స్థానానికి పడిపోగా.. ఆస్ట్రేలియా రెండో స్థానంతో సరిపెట్టుకుంది. ఇక బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో మిగిలిన మూడు మ్యాచుల్లో తప్పక గెలిస్తేనే టీమిండియా ఫైనల్స్‌కు చేరే ఛాన్స్‌ ఉంటుంది. లేదంటే పోటీ నుంచి ఆవుటే. అందుకే బ్రిస్బేన్‌ టెస్టు టీమిండియాకు పెద్ద సవాల్‌గా మారింది.

హర్షిత్‌ రాణాపై వేటు..

గత మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన రోహిత్‌ సేన మూడో టెస్టు కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. బ్యాటింగ్‌ వైఫల్యాలపై టీమిండియా మేనేజ్‌మెంట్‌ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత జట్టులో కొన్ని మార్పులకు అవకాశాలు కనిపిస్తున్నాయి. పేలవ ప్రదర్శనతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న యువ పేసర్‌ హర్షిత్‌ రాణాపై వేటు తప్పదని తెలుస్తోంది.

తొలి మ్యాచ్‌లో పర్వాలేదనిపించిన రాణా.. పింక్‌ బాల్‌ టెస్టులో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. ఇతడినే టార్గేట్‌ చేసుకుని ఆసీస్‌ బ్యాటర్లు భారీగా పరుగులు పిండుకున్నారు. దీంతో కీలకమైన బ్రిస్బేన్‌ టెస్టులో రాణాను తప్పించాలని మేనేజ్‌మెంట్‌ నిర్ణయించుకుంది. అయితే ఇప్పుడు అతడి స్థానాన్ని ప్రసిద్ద్‌ కృష్ణతో భర్తీ చేయనున్నట్లు తెలిసింది.

ఈ కర్ణాటక పేసర్‌ ప్రసిద్ద్‌ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ మెగా సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా-ఎతో జరిగిన అనధికారిక టెస్టు సిరీస్‌ ప్రసిద్ద్‌ మెరుగైన ప్రదర్శన చేశాడు. మొత్తం నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 10 వికెట్లు పడగొట్టి సత్తా చాటుకున్నాడు. అందుకే రాణా స్థానంలో ప్రసిద్ద్‌ను ప్లేయింగ్‌ ఎలెవన్‌లో తీసుకోవాలని భారత హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ కూడా ఆసక్తిగా ఉన్నాడని తెలిసింది.

ఓపెనర్‌గా రోహిత్‌ శర్మ..

భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తన పాత ఆర్డర్‌లోనే బ్యాటింగ్‌ చేయాలని సీనియర్లు సూచిస్తున్నారు. సాధరణంగా ఓపెనింగ్‌ చేసే రోహిత్‌ శర్మ రెండో టెస్టులో మాత్రం మిడిల్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేశాడు. ఆ స్థానంలో పూర్తిగా విఫలమయ్యాడు. అలాగే రోహిత్‌ స్థానంలో ఓపెనింగ్‌ చేసిన కేఎల్‌ రాహుల్‌ సైతం పెద్దగా ప్రభావం చూపలేక పోయాడు.

ఓపెనర్‌గా రోహిత్‌ బరిలోకి దిగుతే ప్రత్యర్థి బౌలర్లపై కూడా సహజంగానే ఒత్తిడి పెరుగుతుంది. హిట్‌ మ్యాన్‌ పిచ్‌పై ఉన్నంతసేపు ఆసీస్‌ బౌలర్లకు చుక్కలు కనబటం ఖాయం. ప్రస్తుతం ఫామ్‌లేమీతో ఇబ్బంది పడుతున్న రోహిత్‌ ఈ మ్యాచ్‌తో మళ్లి ఫామ్‌ను అందుకోవాలని అందరూ కోరుకుంటున్నారు.

కోహ్లీ భారీ అంచనాలు..

విరాట్‌ కోహ్లీ కూడా బ్యాట్‌ ఝుళిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుత భారత జట్టులో ఇతడికే ఎక్కువ అనుభవం ఉంది. అలాగే కంగారూ జట్టుపై కోహ్లీకి మంచి ట్రాక్‌ రికార్డు కూడా ఉంది. దీంతో అతడిపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. వీరిద్దరూ చెలరేగితే కంగారూ బౌలర్లకు కంగారు తప్పదు.

ఇక వీరితో పాటు యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌, కేఎల్‌ రాహుల్‌, రిషభ్‌ పంత్‌ కూడా రాణించాలని అందరూ ఆశిస్తున్నారు. అందరూ కలిసి కట్టు రాణిస్తే భారీ స్కోర్లు సాధించడం సులభమే. ఇక తెలుగబ్బాయి యువ ఆల్‌రౌండర్‌ నితీష్‌ కుమార్‌ రెడ్డి మెరుగైన బ్యాటింగ్‌తో అందరి దృష్టి ఆకర్షిస్తున్నాడు. స్టార్‌ బ్యాటర్లు విఫలమైన చోట తాను మాత్రం దూకుడుగా ఆడుతూ ఆసీస్‌ పేస్‌ దళానికి చుక్కలు చూపెడుతున్నాడు. మూడో టెస్టులో మళ్లి సత్తా చాటేందుకు రెడీగా ఉన్నాడు. అలాగే పలు రికార్డులపై కూడా నితీష్‌ కన్నేశాడు.

జడేజాకు అవకాశం..!

ఆడిలైడ్‌ టెస్టులో విఫలమైన టీమిండియా సీనియర్‌ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ స్థానంలో మరో స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాను బరిలోకి దించేందుకు రంగం సిద్ధమవుతోంది. భారీ అంచనాలుతో బరిలోకి దిగిన అశ్విన్‌ వికెట్లు తీయడంలో విఫలమయ్యాడు. అలాగే బ్యాట్‌తోనూ ఆకట్టుకోలేక పోయాడు. దీంతో జడేజా అయితే టీమిండియా బ్యాటింగ్‌ లైనమ్‌ మరింతగా పటిష్టమవుతుందని మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. దీంతో బ్రిస్బేన్‌ టెస్టులో జడేజా ఎంట్రీ ఖాయమనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement