Saturday, November 23, 2024

Exclusive | విండీస్​తో టీ20 సమరం షురూ.. మరికాసేపట్లో ఫస్ట్​ మ్యాచ్‌!

భారత్‌-వెస్టిండీస్‌ మధ్య ఇవ్వాల్టి (గురువారం) నుంచి 5 మ్యాచ్‌ల టీ20 సమరం మొదలవుతోంది. ట్రినిడాడ్​లో ఇవ్వాల రాత్రి 8 గంటలకు మ్యాచ్​ ప్రారంభం కానుంది. ఇప్పటికే టెస్టు, వన్డే సిరీస్‌లను కైవసం చేసుకున్న టీమిండియా ఇప్పుడు పోట్టి సిరీస్‌ను కూడా గెలుచుకుని, కరీబియన్‌ టూర్‌ను విజయవంతంగా ముగించుకోవాలని చూస్తోంది.

– వెబ్​ డెస్క్​, ఆంధ్రప్రభ

వన్డే సిరీస్‌ మాదిరిగానే టీ20 సిరీస్​లో కూడా సీనియర్‌ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చిన బీసీసీఐ.. యువ ఆటగాళ్లను బరిలోకి దింపుతోంది. వచ్చే ఏడాది విండీస్‌ వేదికగానే 2024 టీ20 ప్రపంచకప్‌ జరుగనుంది. దీంతో ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం యువ ఆటగాళ్లను ఎంపిక చేసింది. భారత జట్టుకు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య సారథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్‌ స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ వైస్‌ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు.

బౌలర్లకు పరీక్ష..

టీ20 స్పెషలిస్ట్‌ జట్టుగా పేరుసాధించిన వెస్టిండీస్‌ జట్టును వారి సొంత గడ్డపై ఎదుర్కోవడం భారత యువ బౌలర్లకు పెద్ద పరీక్షే. పోట్టి క్రికెట్‌లో వెస్టిండీస్‌కు తిరుగులేదనే చెప్పాలి. ప్రపంచ మేటి ఆటగాళ్లు ఈ కరీబియన్‌ జట్టులో ఉన్నారు. విండీస్‌ ఆటగాళ్లు ప్రపంచ నలుమూలల్లో ఐపీఎల్‌ తరహాలో జరిగే ప్రతి టీ20 క్రికెట్‌ టోర్నీల్లో పాల్గొంటూ తమ సత్తా చాటుతున్నారు. అలాంటి పటిష్టమైన జట్టుతో తలపడటం యువ ఆటగాళ్లకు పెద్ద సవాలే. పెద్దగా అనుభవంలేని బౌలర్లు తమ అదృష్ట్యాన్ని పరీక్షించుకోనున్నారు.

- Advertisement -

ఈ సిరీస్‌లో సత్తా చాటుకుంటే వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌ జట్టులో తమస్థానాన్ని మెరుగుపర్చుకోవచ్చు. పేస్‌ విభాగంలో ఎవరికీ ఎంట్రీ లభిస్తుందో.. వన్డే సిరీస్‌లో రాణించిన ముకేశ్‌ కుమార్‌కు మంచి అవకాశం ఉంది. తొలిసారి భారత జట్టులో చోటు సాధించిన ఇతను మంచి ప్రదర్శనలు చేస్తున్నాడు. అలాగే అర్ష్‌దీప్‌ సింగ్‌, ఉమ్రాన్‌ మలీక్‌, ఆవేశ్‌ ఖాన్‌లలో తుది జట్టులో ఎవరు చోటు దక్కించుకుంటారో చూడాలి. ఇక స్పిన్‌ విషయానికి వస్తే కుల్దిdప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, చాహల్‌, రవీ బిష్నోయ్‌లలో కుల్దిdప్‌, చాహల్‌లు తుది జట్టులో స్థానం దక్కొచ్చిని కనిపిస్తోంది. ఒకవేల ఆల్‌రౌండర్‌ వైపు మొగ్గు చూపితే అక్షర్‌ పటేల్‌కు చోటు దక్కడం ఖాయం.

కరీబియన్‌లు ఈసారైనా..

సొంతగడ్డపై వరుసగా రెండు సిరీస్‌లు కోల్పోయిన వెస్టిండీస్‌ జట్టు ఇప్పుడు ఎలాగైన టీ20 సిరీస్‌ను గెలిచి తమ పరువు దక్కించుకోవాలని చూస్తోంది. ప్రస్తుత భారత జట్టులో సీనియర్లు లేకపోవడం విండీస్‌కు ప్లస్‌ పాయింట్‌గా మారే అవకాశం ఉంది. విండీస్‌ జట్టుకు రోమన్‌ పావెల్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. షై హోప్‌, షిమ్రోన్‌ హేట్‌మేర్‌, నికొలాస్‌ పూరన్‌, ఆల్‌రౌండర్‌ జాసన్‌ హోల్డర్‌ తదితరులతో విండీస్‌ బ్యాటింగ్‌ విభాగం పటిష్టంగా ఉంది. బౌలింగ్‌లోనూ స్మిత్‌, థామస్‌, షెఫర్డ్‌, జోసెఫ్‌లు రాణిస్తే టీమిండియాకు కష్టాలు తప్పవు.

జట్ల వివరాలు: (అంచనా)

భారత్‌: హార్దిక్‌ పాండ్య (కెప్టెన్‌), సూర్యకుమార్‌ యాదవ్‌ (వైస్‌ కెప్టెన్‌, ఇషాన్‌ కిషన్‌, శుభ్‌మాన్‌ గిల్‌, యశస్వీ జైస్వాల్‌, తిలక్‌ వర్మ, సంజూ శాంసన్‌, ఆక్షర్‌ పటేల్‌, చాహల్‌, రవీ బిష్నోయ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ఉమ్రాన్‌ మలీక్‌, అవేశ్‌ ఖాన్‌, ముకేశ్‌ కుమార్‌.

వెస్టిండీస్‌: రోమన్‌ పావెల్‌ (కెప్టెన్‌), కీల్‌ మేయర్స్‌ (వైస్‌ కెప్టెన్‌), జాసన్‌ చార్లేస్‌, హేట్‌మేర్‌, జాసన్‌ హోల్డర్‌, షై హోప్‌, అకీల్‌ హోసెన్‌, అల్జారీ జోసెఫ్‌, బ్రాండన్‌ కింగ్‌, ఓబెద్‌ మెకాయ్‌, నికొలాస్‌ పూరన్‌; షెఫర్డ్‌, ఒడియన్‌ స్మిత్‌, ఓషన్‌ థామస్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement