సంప్రదాయానికి భిన్నంగా సెన్ నదిలో పడవలపై అథ్లెట్ల పరేడ్‌తో ఒలింపిక్స్ ప్రారంభోత్సవాన్ని వినూత్నంగా నిర్వహించగా.. ఇప్పుడు పారా విశ్వ క్రీడల ఆరంభాన్నీ అంతే ప్రత్యేకంగా అంటే స్టేడియం బయట జరిపారు. నాలుగు వేలమందికిపైగా అథ్లెట్లు, 22 క్రీడాంశాలలో తలపడే ఈ 11 రోజుల ఆటల పండుగకు బుధవారం రాత్రి ఉత్సాహంగా తెరలేచింది.
నగరం మధ్యలో ఓపెన్ ఎయిర్‌లో చారిత్రాత్మక డిలకాంకార్డ్, చాంప్స్-ఎలిసీస్ వద్ద ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఫ్రెంచ్ పారా స్విమ్మర్ థియో క్యూరిన్ పూలతో అందంగా అలంకరించిన కారులో ప్రారంభోత్సవ వేదిక డి ల కాంకార్డుకు వస్తూ తన అథ్లెట్లకు స్వాగతం పలికాడు.
భారీగా హాజరైన ప్రేక్షకుల చప్పట్లుమధ్య ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్..ఇంటర్నేషనల్ పారాలింపిక్ కమిటీ (ఐపీసీ) చీఫ్ ఆండ్రూ పార్సన్స్‌తో కరచాలనం చేశారు. అనంతరం కెనడాకు చెందిన ప్రఖ్యాత పియానిస్ట్ చిల్లీ గొంజాలె్‌స..పియానో వాయిస్తుండగా 140 మంది డ్యాన్సర్లతో సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి.
ఈ తరుణంలో పారాలింపిక్స్ మస్కట్ ‘పిర్ఘే’ స్టేజ్‌పైకి వచ్చి అతిథులు, ప్రతినిధులు, అథ్లెట్లకు స్వాగతం పలికింది. ఆపై..పలువురు ఫ్రెంచ్ కళాకారులు.. తమ దేశ దివంగత దిగ్గజ గాయని ఎడిత్ పియా్‌ఫకు నివాళిగా ఆమె పాడిన పాటను ఆలపించారు.
అనంతరం అథ్లెట్ల మార్చ్‌పాస్ట్ ప్రారంభమైంది. తొలుత అఫ్ఘానిస్థాన్ రాగా అనంతరం సౌతాఫ్రికా జట్టు విచ్చేసింది. అఫ్ఘాన్ తరపున ఒకే ఒక అథ్లెట్ బరిలో దిగుతోంది. తదుపరి జర్మనీ, అర్జెంటీనా అథ్లెట్లురాగా..జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్, షాట్‌పుటర్ భాగ్యశ్రీ జాదవ్ త్రివర్ణ పతకాన్ని ధరించి ముందు నడవగా బృందం సభ్యులు వారిని అనుసరించారు.
తెల్ల కుర్తా, పైజమాతోపాటు పైన ఓవర్ కోట్, మెడలో త్రివర్ణ పతాక రంగులతో కూడిన కండువాను ధరించి భారత అథ్లెట్లు పరేడ్‌లో పాల్గొన్నారు. గురువారం పోటీలు ఉండడంతో 10 మంది షూటింగ్ జట్టు పరేడ్‌లో పాల్గొనలేదు. పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేత, జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా భారత పారా బృందానికి బెస్టాఫ్ లక్ చెప్పాడు. అథ్లెట్ల పరేడ్ జరుగుతుండగానే విమానాలు ఫ్రెంచ్ జాతీయ పతాకంలోని రంగులను వదులుతూ కనువిందు చేశాయి.