Wednesday, November 20, 2024

సిరీస్‌ కైవసమే లక్ష్యం.. సౌతాఫ్రికా కెప్టెన్‌ టెంబా బవుమా

ముంబై: ఇండియాతో ఆడబోయే మ్యాచ్‌ల కోసం ఎదురుచూస్తున్నామని సౌతాఫ్రికా కెప్టెన్‌ టెంబా బవుమా తెలిపారు. జూన్‌ 9 నుంచి ఐదు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌ ప్రారంభం కానుంది. ఇప్పటికే భారత్‌ చేరిన దక్షిణాఫ్రికా జట్టు కసరత్తు ప్రారంభించింది. గత ఏడాది యూఏఈలో ఐసీసీ మెన్స్‌ టీ20 వరల్డ్‌ కప్‌ తర్వాత తొలిసారిగా టీమిండియాతో దక్షిణాఫ్రికా ద్వైపాక్షిక సిరీస్‌ ఆడనుంది. ఈ సిరీస్‌ అనంతరం రెండు జట్లూ ఈ ఏడాది చివరిలో ఆస్ట్రేలియాలో జరిగే మెన్స్‌ టీ20 వరల్డ్‌ కప్‌కు సన్నద్ధంకానున్నాయి. 2015 తర్వాత భారత్‌తో దక్షిణాఫ్రికా ద్వైపాక్షిక సిరీస్‌ ఆడటం ఇది మూడోసారి. 2015 అక్టోబర్‌లో భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకోగా 2019 సెప్టెంబర్‌లో జరిగిన టీ-20 సిరీస్‌ను 1-1తో డ్రాగా ముగిసింది.

”ప్రస్తుతం జూన్‌ 9 నుంచి ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ మా కెంతో ముఖ్యం. టీ20 జట్టుగా, ప్రపంచ కప్‌ తర్వాత మేము కలిసి ఆడటం ఇదే మొదటిసారి. ప్రపంచ మేటి జట్టుగా కొనసాగుతున్న భారత్‌పై తామెలా ఆడాలో ఇప్పటికే వ్యూహరచన చేశాం. ఈసారి జట్టులో కొత్త వారికి అవకాశం కల్పించాం, వారు తమ ప్రతిభా పాటవాలు ప్రదర్శించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడనుంది” అని బవుమా పేర్కొన్నారు. సిరీస్‌ కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాం, బ్యాటింగ్‌ ఆర్డర్‌ పరంగా చాలా ప్రావీణ్యం సంపాదించామని సౌతాఫ్రికా కెప్టెన్‌ వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement