వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్స్‌ను అధిగమించి ముందుకు దూసుకెళ్లాలన్న రష్యన్ భామ మిర్రా ఆండ్రీవా స్వప్నం చెదిరింది. 16 ఏళ్ల ప్రాయంలోనే ప్రతిష్టాత్మక టోర్నీలో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరిన ఆమె ఆశలను 25వ సీడ్ అమెరికన్ మాడిసన్ కీస్ చెదరగొట్టింది. సోమవారం జరిగిన నాల్గవ రౌండ్ పోటీలో మాడిసన్ వరుస సెట్లను గెలిచి తదుపరి రౌండ్‌కి చేరుకుంది. 3-6, 7-6(4), 6-2 స్కోరుతో ఆండ్రీవా కలల పరుగుకు మాడిసన్ బ్రేకులు వేసింది. మొదటి సెట్‌లో తడబడిన కీస్, రెండవ సెట్‌లో గట్టి పోటీని ఎదుర్కొంది.
5-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లినప్పటికీ సెట్‌ను నిలుపుకునేందుకు చెమటోడ్చాల్సి వచ్చింది. అతికష్టంమీద 7-6(4)తో సెట్‌ను కైవసం చేసుకున్న కీస్, మూడవ సెట్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని చాటింది. అప్పటి దాకా హోరాహోరీగా సాగిన గేమ్ ఒక్కసారిగా మాడిసన్ కీస్ వైపు మళ్లింది. ఏకపక్షంగా సెట్ సాగింది. దాంతో ఆండ్రీవా పోరాటం ముగిసింది. దాదాపు గంటపాటు ఆండ్రీవా పూర్తి నియంత్రణతో ఆడింది. ఆ తర్వాత రెండవ సెట్ టై బ్రేక్ వచ్చే సమయానికి ప్రత్యర్థి కీస్ ఊపందుకుంది. కాగా, కీస్‌కి ఇది రెండవ వింబుల్డన్ క్వార్టల్ ఫైనల్. ఇంతకు ముందు 2015లో గ్రాస్ కోర్టు మేజర్‌లో చివరి ఎనిమిది స్థానాల్లో నిలిచింది.
అంపైర్‌తో వాగ్వాదం.. పెనాల్టి..
రెండవ సెట్ టై బ్రేక్‌లో ఓటమి తర్వాత రాకెట్‌ను విసిరికొట్టినందుకు ఆండ్రీవాకు అంపైర్ జూలీ క్జెండ్లీ మొదటి వార్నింగ్ ఇచ్చింది. కీస్ 2-5 ఆధిక్యం వద్ద డ్యూస్‌ని బలవంతం చేయడంతో ఆమె మళ్లిd రాకెట్‌ను విసిరినట్లు కనిపించింది. దాంతో నిర్ణయాత్మక సెట్‌లో రెండవ సారి వార్నింగ్ ఎదురైంది. ఆటోమేటిక్‌గా పాయింట్ పెనాల్టిdకి గురైంది. ఇది ఆమె ప్రత్యర్థికి మ్యాచ్ పాయింట్‌గా మారింది. ఈ సందర్భంగా అసహనానికి గురైన ఆండ్రీవా అంపైర్ జూలీతో వాగ్వాదానికి దిగింది. మీరు ఏం చేస్తున్నారో మీరు అర్ధమవుతోందా? నేను రాకెట్‌ను విసిరి కొట్టలేదు. నేను అదుపుతప్పి జారిపడ్డాను. మీది తప్పుడు నిర్ణయం అంటూ మండిపడింది. మ్యాచ్ ముగిశాక తన ప్రత్యర్థితో కరచాలనం చేసిన ఆండ్రీవా, అంపైర్‌కు షేక్‌హ్యాండ్ ఇవ్వకుండానే ఆమె ముందు నుంచి రుసరుసా వెళ్లిపోయింది. ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ ఆండ్రీవా ఇలాంటి వైఖరినే కనబరిచింది. ప్రేక్షకులపైకి కోపంగా బంతిని కొట్టడం ద్వారా డిఫాల్ట్ అయింది. మ్యాచ్‌ను చేజేతులా జారవిడుచుకుంది. ఇప్పుడూ అలాంటి పరిస్థితి ఎదురవుతదనే భయంతోనే ఆమె అంపైర్‌తో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది